Sep 12,2023 09:09

పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకుందాం' పోస్టర్లు విడుదల చేస్తున్న జాయింట్‌ కలెక్టర్‌

      అనంతపురం కలెక్టరేట్‌ : వినాయక చతుర్థి సందర్భంగా మట్టి వినాయకుడిని పూజించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సహజ రంగులతో చేసిన మట్టి ప్రతిమలతో 'పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకుందాం' అనే కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు అందరూ సమష్టిగా కషి చేయాలన్నారు. సహజ రంగులతో చేసిన మట్టి ప్రతిమలతో పర్యావరణ అనుకూల వినాయక చవితిని జరుపుకోవాలన్నారు. వినాయక చవితి పండుగను సుస్థిరంగా, పర్యావరణానికి అనుకూలంగా జరుపుకోవాల్సుందన్నారు. చెరువులు, జల వనరులకు నష్టం కలిగించే వ్యర్థ పదార్థాల వినియోగం తగ్గింపు, లేదా పూర్తిగా మానేయాలన్నారు. మట్టితో చేసిన ప్రతిమలను వాడాలన్నారు. విగ్రహాల తయారీకి సహజసిద్ధమైన రంగులను ప్రకృతిలో లభ్యమయ్యే పత్తి, నారా వంటి పదార్థాలను వినియోగించాలన్నారు. రసాయనాలు వినియోగిస్తే నీటి కాలుష్యానికి దారితీస్తాయన్నారు. రెవెన్యూ, మున్సిపల్‌, జిల్లా పంచాయతీ డిపార్ట్‌మెంట్‌, అగ్నిమాపక శాఖ, విద్యుత్‌ శాఖ మరియు పోలీసు శాఖలు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన సవరించిన మార్గదర్శకాలను అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ గాయత్రీ దేవి, ఆర్డీవో మధుసూదన్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులు, ఎపిపిసిబి ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ పివి.కిషోర్‌ రెడ్డి, ఎపిపిసిబి ఎఈఈ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.