Oct 14,2023 20:38

సాలూరు: చేపపిల్లలను విడిచిపెడుతున్న ఈశ్వరమ్మ

ప్రజాశక్తి- సాలూరు : రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ చెప్పారు. శనివారం ఆమె పట్టణంలోని పేరసాగరం చెరువులో 54,300 చేప పిల్లలలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేపల వేట వృత్తిగా జీవిస్తున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. జిల్లా ఫిషరీస్‌ అధికారి వి.తిరుపతయ్య మాట్లాడుతూ జిల్లాలో 10.05లక్షల చేప పిల్లలను రూ.16లక్షలతో కొనుగోలు చేసి విడుదల చేసినట్లు తెలిపారు. జిల్లాలో 48 మత్స్యకార సంఘాలలో 4,600మంది సభ్యులు వున్నారని చెప్పారు. ఫిష్‌ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 68 యూనిట్లు మంజూరయినట్లు చెప్పారు. ఇప్పటికే 60 యూనిట్లు ప్రారంభమయ్యాయన్నారు. ఒక్కో యూనిట్‌కి రూ.1.75లక్షలు నుంచి రూ.3.25లక్షల వరకు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి మహిళలకు 60 శాతం సబ్సిడీ, బీసీలకు 40శాతం సబ్సిడీ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 110 చెరువుల్లో చేపపిల్లలను విడుదల చేశామన్నారు. వచ్చేనెల 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు బోట్లు, వలలు, ఇతర పనిముట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, కౌన్సిలర్‌లు రాపాక మాధవరావు, పప్పల లక్ష్మణరావు, గొర్లి వెంకటరమణ, నెయ్యిల కుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు టెక్కలి ధర్మారావు పాల్గొన్నారు.
పాచిపెంట: చేప పిల్లల పెంపకంతో మత్స్యకారుల ఆదాయం పెంచుకోవచ్చునని ఎంపిపి బి.ప్రమీల అన్నారు. మండల కేంద్రంలోని పెద్దగెడ్డ జలాశయంలో శనివారం చేప పిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపిపి బి. ప్రమీల మాట్లాడుతూ ఈ పెద్ద గెడ్డ జలాశయం ద్వారా సుమారు 200 మంది గిరిజన మత్స్యకార రైతులు చేపలను వేటాడుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. అర్హుడైన ప్రతి ఒక్క మత్స్యకార రైతుకి మత్స్యకారి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. సబ్సిడీ ద్వారా చేపలు పట్టుకు నేందుకు వలలు కూడా అందింస్తున్నామన్నారు. చేపల వేటకు వెళ్లే సమయంలో ప్రమాదవశాత్తు ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబానికి వైయస్సార్‌ మత్స్యకార బీమా ద్వారా రూ.10లక్షల ప్రభుత్వం అందిస్తుందన్నారు. జలాశయంలో చేపలు పట్టుకుంటూ ఎవరైతే జీవనం సాగిస్తున్నారో వారందరికీ సభ్యత్వ నమోదు చేయాలని, వారందరికీ బీమా చేయించే బాధ్యత కూడా మత్స్యకార శాఖ అధికారులే తీసుకోవాలని కోరారు. ఏడి తిరుపతయ్య మాట్లాడుతూ త్వరలో మత్స్యకారులకు వలలు, బోట్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు గొట్టాపు ముత్యాలు నాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పాచిపెంట వీరంనాయుడు, వైస్‌ ఎంపిపి కొరపల్లి రవీంద్రనాథ్‌, సర్పంచ్‌ ఇజ్జాడ అప్పలనాయుడు, ఎంపిటిసి దండి ఏడుకొండలు, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు జోగరాజు, పలు గ్రామాలు మత్స్యకారులు పాల్గొన్నారు.