Apr 19,2023 22:40

eftar lo palgonna collector

మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌ : కలెక్టర్‌

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)
పవిత్ర రంజాన్‌ పండుగ మత సామరస్యానికి ప్రతీక అని కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు అన్నారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్‌ కన్వెన్షన్‌ హాలులో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పి.రాజాబాబు మాట్లాడుతూ దైవారాధన, ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణ, దాతృత్వానికి రంజాన్‌ మాసం ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలు సోదరభావం, ప్రేమను పెంపొందిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ అల్లా అనుసరించిన మార్గంలో నడవాలన్నారు. మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ, రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీలకు పెద్దపీట వేస్తున్న ఘనత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కీర్తిశేషులు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, అదేబాటలో ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. తొలుత మౌలానాలు ఖురాన్‌ పఠనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రంజాన్‌ మాసం విశిష్టతపై పలువురు వక్తలు ఉపన్యసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజితా సింగ్‌, డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీవో ఐ.కిషోర్‌, మచిలీపట్నం తహశీల్దార్‌ సునీల్‌ బాబు, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిణి షమ్‌ సున్నీసా బేగం, మాజీ మునిసిపల్‌ ఛైర్మెన్‌ షేక్‌ సలార్‌ దాదా, యువ నాయకులు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు), జామియా మసీద్‌ ఇమామ్‌ రఫీక్‌ ఆలం, మచిలీపట్నంలోని వివిధ మసీదుల కమిటీ అధ్యక్షులు, ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.