Mar 25,2023 22:35

collector to matladutnna muslimulu

మసీదుల వద్ద మౌలిక వసతులు కల్పించాలి : కలెక్టర్‌
ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)
రంజాన్‌ పవిత్ర మాసం ముస్లిములు భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు మసీదుల వద్ద శానిటేషన్‌, తాగునీరు, విద్యుత్‌ సమస్యలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా స్థాయి కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 9963478976 కు ఫోన్‌ చేయాలని కలెక్టర్‌ సూచించారు. శనివారం కలెక్టరేట్‌ స్పందన మీటింగ్‌ హాల్లో ముస్లిమ్‌ మత పెద్దలతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి మసీదు సంబంధిత అధికారులు సందర్శించి శానిటేషన్‌, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలపై తనిఖీలు నిర్వహించాలని, ఇందుకోసం ప్రొఫార్మా డిజైన్‌ చేయాలని సూచించారు. రూపొందించిన ప్రొఫార్మాలో నివేదికలు సమర్పించాలన్నారు. చిన్న పనులు పరిష్కారానికి అసరమైన అంచనాలు రూపొందించి సమర్పించాలన్నారు. తెల్లవారుజామున విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. అవసరమైతే ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ మహ్మద్‌ రుహుల్లా మాట్లాడుతూ పవిత్ర రంజాన్‌ మాసంలో మసీదుల వద్ద ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభుత్వ పరంగా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డీఎస్పీ మాసూమ్‌ బాషా మాట్లాడుతూ అన్ని మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తామనానరు. ప్రార్ధనల సమయంలో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ షేక్‌ సిలారాదా, జామియా మసీదు అధ్యక్షులు తదితరులు మసీదుల వద్ద సమస్యలు వివరిస్తూ తెల్లవారుజాము విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని, జామియా మసీదు వద్ద రోడ్డు వెడల్పు తక్కువ, ట్రాఫిక్‌ సమస్య ఏర్పడకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా షేక్‌ సిలార్‌ దాదా మస్లిమ్‌ పెద్దలతో కలసి జిల్లా కలెక్టర్‌ ను, ఎమ్మెల్సీని శాలువలతో సత్కరించారు. ఈ సమావేశంలో డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, మైనార్టీ సంక్షేమ శాఖాధికారి షంసున్నీసా, డిఎం అండ్‌ హెచ్‌ డా. గీతాబాయి, ఆర్డీఓలు ఐ. కిషోర్‌, విజయకుమార్‌, డిపిఓ ఎస్‌ వి నాగేశ్వరనాయక్‌, మున్సిపల్‌ కమీషనర్లు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలను నిరోధించాలి
క్రమం తప్పకుండా వాహన చోదకులకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్‌లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, లారీలు, ట్రాక్టర్లు ద్వారా గత ఫిబ్రవరి నెలలో 65 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. పెనమలూరు హైవే వద్ద రద్దీ సమయాల్లో ఇసుక లారీలను అనుమతించకుండా అందుకు ప్రత్యేక సమయాలను కేటాయించాలన్నారు. మచిలీపట్నంలో ప్రధాన రహదారులపై పశువులు సంచరించకుండా తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమీషనరు సూచించారు. జిల్లా రవాణాధికారి సీతాపతి, డీఎస్పీ రమేష్‌ బాబు, మచిలీపట్నం డిపో మేనేజర్‌ పెద్దిరాజు, డిఎంఅండ్‌ హెచ్‌ జి.గీతాబాయి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.