ప్రజాశక్తి :కనగానపల్లి : అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న మండలంలోని పాతపాళ్యం గ్రామానికి చెందిన మహిళా రైతు శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఎపి రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి బత్తల కదిరిప్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శ్రావణికి ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారన్నారు. భర్తకు మతి స్థిమితం లేకపోవటంతో కుటుంబాన్ని పోషించడానికి శ్రావణి తనకున్న 9ఎకరాల పొలంలో వ్యవసాయం చేయాల్సి వచ్చిందన్నారు. పంటలసాగుకు, పిల్లల చదువులకు, ఇంటి పోషణకు దాదాపు రూ. 10లక్షలు అప్పుచేసిందన్నారు. పంటలు పండక అప్పు తీర్చలేక అప్పులు ఇచ్చినవాళ్ళతో ఒత్తిడి ఎక్కువ కావటంతో శ్రావణి ఆత్మహత్య చేసుకుందన్నారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ. 15లక్షలు అందజేయాలని రుణం మాఫీ చేసి అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.










