ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూల్ నగరంలో వినాయక చవితి పండుగ సందడి మొదలైంది. నగర్ ప్రజలే కాక నగర చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నగరానికి వచ్చి వినాయక విగ్రహాలు పూజా సామాగ్రి కొనేందుకు తరలి రావడంతో ప్రధాన కూడళ్ళు సందడి సందడిగా మారాయి. ప్రధానంగా రైతు బజార్లో పెద్ద మార్కెట్ పూల బజార్, మద్దూర్ నగర్ తదితర ప్రాంతాల్లో చిన్న విగ్రహాలు 50 రూపాయల విగ్రహాల నుండి 1500 రూపాయల విగ్రహాల వరకు బండ్లపై పెట్టి అమ్ముతున్నారు. వీటికి తోడుగా పూజా సామాగ్రి కూడా 150 రూపాయలకు అమ్ముతున్నారు. గరిక, ఉమ్మెత్త కాయలు, చెరుకు గడలు, వెలగ కాయలు, అరటి బోధలు కూడా అమ్ముతున్నారు. నగరంలో నీ వీధులలో విగ్రహాలను ప్రతిష్టించేందుకు మండపాలను సుందరంగా అలంకరించి తీర్చిదిద్దుతున్నారు. వినాయక విగ్రహాలు 6 నుండి 15 అడుగుల వరకు తయారుచేస్తారు. వీటిని సైజులు వివిధ ఆకృతులను బట్టి 10 నుండి 50 వేల వరకు పెట్టి విగ్రహాలను కొని తీసుకొని వెళుతుంటారు. నంద్యాల చెక్పోస్ట్ పాత శ్రీనివాస థియేటర్ సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో విగ్రహాల తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ విగ్రహాలకు తుది మెరుగులు దిద్ది అందంగా తీర్చిదిద్ది సిద్ధంగా ఉంచారు. నగరంలో పది ప్రాంతాల్లో విగ్రహ విక్రయ కేంద్రాలు ఉన్నాయి.నగరంలో వెయ్యికి పైగా విగ్రహాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నగరంలో ప్రతిష్టించే విగ్రహాలకు పోలీసు వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. హిందూ ముస్లింలు భాయి భాయిగా మసులుకుంటూ ఒకరి పండగ ఒకరు కలిసిమెలిసి చేసుకునే మంచి సంస్కృతి కర్నూలు నగరంలో ఉంది. వినాయక విగ్రహాల మంటపాల వద్ద పూజలు నిర్వహించేందుకు బ్రాహ్మణులకు మంచి గిరాకీ ఉంటుంది. విగ్రహాలను ప్రతిష్టించి 9 రోజులు (నవరాత్రులు) పూజల నిర్వహించి అనంతరం కేసీ కెనాల్ నందు తుంగభద్రలో వినాయకులను నిమజ్జనం చేస్తారు.
- వ్యాపారాలు లేవు : పద్మావతి, పెద్ద మార్కెట్ కర్నూలు.
టీజీ వెంకటేష్ మట్టి విగ్రహాలను ఉచితంగా నగరంలోని ప్రజలకు పంపిణీ చేస్తున్నారని తెలిసింది. దీనితో పది సంవత్సరాలుగా వినాయక విగ్రహాలను పెట్టుకుని అమ్ముకునే మాలాంటి చిన్న వ్యాపారస్తులకు గిరాకీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. విగ్రహాలు వంద నుండి రూ 1500 వరకు అమ్ముతుంటాం అలాగే పూజా సామాగ్రి 150 రూపాయలు చెప్పి వంద రూపాయలకు అమ్ముతాం. పూజకు కావలసిన సామాగ్రి మొక్కజొన్న కంకి, నారింజ, వెలగ, దానిమ్మ, లతోపాటు పత్తెర కలిపి అమ్ముతాం.










