Sep 03,2023 21:33

సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌

        ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌  సమస్యల పరిష్కారానికి అంగన్‌వాడీ కార్మికులు మరో పోరాటానికి సిద్ధం కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్‌.నాగేంద్రకుమార్‌ పిలుపునిచ్చారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు శకుంతల అధ్యక్షతన ఆదివారం గణేనాయక్‌ భవన్‌లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఎన్నికల ముందు సిఎం జగన్‌ ఇచ్చిన హామీలు అమలను చేయాలన్నారు. అంగన్వాడీలకు తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని నాలుగున్నర సంవత్సరాలు వేతనాలు పెంచలేదన్నారు. రిటైర్మెంట్‌ వయస్సు 65 సంవత్సరాలకు పెంచాలన్నారు. గ్రాట్యూటి అమలు చెయ్యాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. మిని సెంటర్‌లను మెయిన్‌ సెంటర్‌లుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలకు తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచి సిఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణాలో 2021 జూలై నెల నుండి వర్కర్లకు రూ.13,650, హెల్పర్‌, మినీ వర్కర్క రూ.7,800 ఇస్తున్నారని తెలిపారు. కాని మన రాష్ట్రంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదన్నారు. ఇటీవల తెలంగాణా ప్రభుత్వం అంగన్వాడీలకు రిటైర్మెంట్‌ వయస్సు 65 సంవత్సరాలకు పెంచిందన్నారు. మిని సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మార్పు చెయ్యటంతో పాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ పెంచారని తెలిపారు. కావున ఆంధ్రప్రదేశ్‌లో కూడా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మిని వర్కర్లకు తెలంగాణా కన్నా అదనంగా వేతనాలు పెంచాలన్నారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. మిని సెంటర్లనుమెయిన్‌ సెంటర్లుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో అంగన్వాడీలు మరో పోరాటానికి సిద్ధమవువుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి, జిల్లా కోశాధికారి జమున, జిల్లా నాయకులు కాత్యాయని, లావణ్య, అరుణ, రేష్మ, తిప్పిరమ్మ, విజయనిర్మల, తదితరులు పాల్గొన్నారు.