Jun 15,2023 21:16

బ్లూ కోర్స్‌ ద్విచక్ర వాహనాలను పరిశీలిస్తున్న డిఐజి

మరింత నమ్మకం పెంచండి
కర్నూల్‌ జిల్లా రేంజ్‌ డిఐజి ఎస్‌.సెంథిల్‌ కుమార్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     పోలీసులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్‌ శాఖపై మరింత నమ్మకం పెంపొందించేలా ఉత్తమ సేవలు అందించాలని కర్నూలు రేంజ్‌ డిఐజి ఎస్‌. ఎస్‌.సెంథిల్‌ కుమార్‌ సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా గురువారం నంద్యాల తాలూకా పోలీస్‌ స్టేషన్‌, 2 టౌన్‌ పోలీసు స్టేషన్‌, ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్లను కర్నూలు జిల్లా రేంజ్‌ డిఐజి తనిఖీ చేశారు. అంతకు ముందు డిఐజి తాలూకా పోలీస్‌ స్టేషన్‌కు రాగానే జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌ రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ జి.వెంకట రాముడు, సబ్‌ డివిజన్‌ డిఎస్పి సి.మహేశ్వర్‌ రెడ్డిలు స్వాగతం పలికారు. తాలూకా ఎస్సై రామ్మోహన్‌ రెడ్డి, 2 టౌన్‌ ఎస్సై హరి ప్రసాద్‌, ట్రాఫిక్‌ ఎస్సై నవీన్‌ బాబు, వారి సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన స్టేషన్‌ పరిసరాలను, స్టేషన్ల పనితీరును, రికార్డులను, సిసి కెమెరాల పని తీరును పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదిదారుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డిఐజి పోలీసు అధికారులకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. పోలీసు స్టేషన్ల పరిధిలో నేర, శాంతి భద్రతల పరిస్థితిలు, అసాంఘిక కార్యకలాపాలు, ఎక్కువగా జరిగే నేరాలపై అధికారులను ఆరా తీశారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యక దృష్టి ఉంచాలని, దర్యాప్తులో ఉన్న కేసులలో వృత్తి నైపుణ్యత, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితులను అరెస్ట్‌ చేయాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఆదేశించారు. ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌, క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌తో పెండింగ్‌ కేసులను త్వరగా పూర్తి చేయాలనానరు. ప్రతి ఒక్క రిజిస్టర్‌ను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. సైబర్‌ క్రైమ్‌, ఆన్లైన్‌ ఫ్రాడ్లు, 1930, దిశ యాప్‌ రిజిస్టేషన్‌, డయల్‌ 112, 100 నంబర్లు వాటి ఉపయోగం విద్యార్ధులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వార్డు మహిళ కార్యదర్శులతో మాట్లాడి వారికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రతి సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందించాలని ఆదేశించారు. అనంతరం నంద్యాల ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. బ్లూ కోర్స్‌ వాహనాలను పరిశీలించారు. నంద్యాల పట్టణంలో ఎక్కడబడితే అక్కడ వాహనాలు పార్క్‌ చేయకుండా, రాకపోకలకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని, రహదారులపై వాహనాలు నిలపడం, రాంగ్‌ రూట్‌, త్రిబుల్‌ రైడింగ్‌, మైనర్‌ డ్రైవింగ్‌లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. త్రిబుల్‌, ర్యాష్‌, మైనర్‌ డ్రైవింగ్‌లకు పాల్పడే యువకులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్నారు.