Aug 09,2023 23:12

ప్రజాశక్తి-ఉయ్యూరు : క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజలందరూ ఐక్యమై, క్విడ్‌ కార్పోరేట్‌ నినాదంతో ముందుకు వచ్చి, మన దేశాన్ని ప్రజలందరూ అన్నం పెట్టే వ్యవసాయాన్ని రక్షించుకోవాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావు విజ్ఞప్తి చేశారు. క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా బుధవారం ఉయ్యూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర పోరాట సంగ్రామంలో మూల మలుపుగా ఉన్న క్విట్‌ ఇండియా నినాదం దేశ ప్రజలను ఉర్రూతలూగించిందని, అదే నినాదంతో నేడు క్విడ్‌ కార్పోరేట్‌, సేవ్‌ అగ్రికల్చరల్‌, సేవ్‌ ఇండియా నినాదంతో ప్రజలు ముందుకు రావాలని కోరారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ఆస్తులను భారీ పరిశ్రమలను, నౌక, ఎయిర్పోర్ట్‌, రైళ్లు, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, భారీ పరిశ్రమలు, చివరకు రక్షణ రంగంలో కూడా కారు చౌకగా కార్పొరేట్లకు దోచిపెడుతుందని, ఈ విధానాలను త్రిప్పి కొట్టి, ప్రగతి నిరోధక, మతోన్మాద శక్తులను తరిమికొట్టాలని ఆయన కోరారు. కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె శివ నాగేంద్రం మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలోనే కాకుండా, వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్లకు దోచి పెట్టాలని, మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చిందని దానికి వ్యతిరేకంగా రైతాంగం 13 నెలలపాటు అలుపెరగని పోరాటం చేసి వాటిని వెనక్కి పంపించారని, ఇది రైతాంగ విజయమని అన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీవో గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు ప్రసాద్‌, రైతు సంఘం జిల్లా నాయకులు అన్నె సుబ్బారావు, పి దుర్గారావు, కౌలు రైతు సంఘం నాయకులు మాదు నాగేశ్వరావు, సుబ్బారావు ,(బుల్లియ) వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జువ్వనపూడి వెంకటేశ్వరరావు, డివైఎఫ్‌ఐ నాయకులు బాజీ బాబు ప్రజాసంఘాల నాయకులు బొల్ల వెంకటేశ్వరావు, పడాల లక్ష్మణ ,జి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.