Apr 19,2023 22:54

పోస్టర్లు విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-కనగానపల్లి : బిజెపి మతోన్మాద, కార్పోరేట్‌ అనుకూల ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ ఈనెల 14 నుండి 30 వరకు దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా బుధవారం కనగానపల్లి మండలం కేంద్రంలో ప్రచార బేరి గోడపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి బత్తల కదిరప్ప, సిపిఐ మండల కార్యదర్శి సుధాకర్‌ మాట్లాడుతూ సామాన్య ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి నిత్యవసర వస్తువులు ధరలు అదుపు చేయడంలో మోడీ సర్కార్‌ వైఫల్యం చెందిందని విమర్శించారు.గత 9 సంవత్సరాల నుండి ఒక పథకం ప్రకారం మత విద్వేషాలు రెచ్చగొట్టడం మన భారత రాజ్యాంగాన్ని లౌకిక తత్వాన్ని విధ్వంసం చేయడం, కార్పొరేటర్ల దేశంగా మార్చడం చేస్తున్నదన్నారు. మోడీ చేస్తున్న దుర్మార్గాలను ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయడానికి వెనుకాడటం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోగా ఉత్తరాంధ్ర జిల్లాలకు తల మానికంగా ఉన్న విశాఖస్టీల్‌ ప్లాంట్‌ ను అమ్మేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రధానమైన రాజకీయ పార్టీలు మోడీని ఒక్క మాట అనడానికి భయపడుతున్నాయని విమర్శించారు. మోడీ నియంతత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 14 నుండి 30వ తేదీ వరకు దేశవ్యాప్త ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ నాయకులు గోవిందు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.