Apr 26,2023 08:38

ప్రచార భేరిబహిరంగసభలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌

              ధర్మవరం టౌన్‌ : దేశంలో తొమ్మిదేళ్ల నరేంద్ర మోడీ పాలనలో అంబానీ, ఆదానీలకు దేశ సంపదను ధారాదత్తం చేస్తూ, ప్రజాధనం మొత్తాన్ని లూటీ చేస్తున్నారని సిపిఎం, సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల ప్రారంభం నుంచి ప్రచారభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం నాడు ధర్మవరం పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్లో ప్రచారభేరి- బహిరంగసభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్రకార్యదర్శి కె.రామక్రిష్ణ, సిపిఎం శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారి చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటు పరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదానీ, అంబానీలకు ప్రజాధనాన్ని అప్పజెప్పారన్నారు. రూ.400 ఉన్న గ్యాస్‌ ధర నేడు రూ.1200కు చేరిందంటే బిజెపి పాల ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ధర్మవరం లాంటి ప్రాంతంలో చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోవడానికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. రాష్ట్రానికి బిజెపి చేస్తున్న అన్యాయంపై ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మౌనంగా ఉండడం సరికాదన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌ మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రజా వ్యతిరక పాలన సాగిస్తోందన్నారు. ప్రజలపై భారాలు వేస్తూ నడ్డివిరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరక పాలన సాగిస్తున్న బిజెపి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజియులు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి జింకా చలపతి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, సీపీఎం పట్టణ కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటమయ్య, రైతుసంఘం జిల్లా కార్యదర్శి జెవి.రమణ, సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌హెచ్‌.బాషా, అయూబ్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.