Sep 14,2023 21:37

అనంతపురం ఐఎబి సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

         అనంతపురం ప్రతినిధి : జిల్లాలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాభావంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్ట రైతులే కాకుండా ఆయకట్టు రైతులకూ ఇక్కట్లు తప్పడం లేదు. వర్షాభావ పరిస్థితుల్లో సాగునీటిపైనా రైతుల్లో సర్వత్రా ఆత్రుత ఆందోళన నెలకొంది. ఈ సమయంలో ఇప్పటికే జరగాల్సిన సాగునీటి సలహామండలి సమావేశం ఖరీఫ్‌ సీజన్‌ మరికొద్ది రోజుల్లో ముగుస్తున్న సమయంలో ప్రభుత్వం సాగునీటి సలహా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సమస్యలపై ఏమి చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారోనని రైతులు ఆసక్తిగా ఎదురు చూశారు. కాని ఇంతటి కీలకమైన సమావేశాన్ని మొక్కుబడిగా ముగించారు. గురువారం ఉదయం జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని డిపిఆర్‌సి సమావేశం హాలులో సాగునీటి సలహామండలి, అగ్రికల్చర్‌ అడ్వయిజరీ బోర్డు మీటింగ్‌ రెండు కలిపి ఒకేసారి జరిపారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్‌ గౌతమి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌, విప్‌ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ బి.గిరిజమ్మ, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, వై.వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిలతోపాటు ఎంపిలు తలారి రంగయ్య, గోరంట్ల మధవ్‌లు పాల్గొన్నారు. రెండు సమావేశాలు ఒకేసారి జరపడంతో హాలు పట్టక చాలా మంది డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీరు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్లు ఇతర అధికారులు బయటే నిలబడిపోవాల్సింది. దీని తరువాత రాప్తాడు నియోజకవర్గ సమీక్షను కూడా జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏర్పాటు చేయడంతో హడావుడిగా మూడు సమావేశాలను నిర్వహించారు.
మీడియాకు అనుమతి నిరాకరణ
జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జరుగుతున్న సాగు, వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ప్రజాప్రతినిధులు ఎటువంటి సమస్యలను లేవనెత్తారు, వాటి పరిష్కారానికి ఏ చర్యలు తీసుకున్నారన్నది ప్రజలకు చేరవేసేది మీడియా. అయితే ఇంతటి కీలకమైన సమయంలో జరుగుతున్న సలహా మండలి సమావేశానికి మీడియాకు అనుతినివ్వలేదు. ఐఅండ్‌పిఆర్‌ ద్వారా నోట్‌ పంపుతామని అక్కడికెళ్లిన మీడియా ప్రతినిధులకు సమాధానం చెప్పారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటన్నది ఆ తరువాత ఐఅండ్‌పిఆర్‌ పంపిన నోట్‌లోనూ లేకపోవడం గమనార్హం. తాగునీటికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు మాత్రమే పేర్కొన్నారు. హెచ్‌ఎల్‌సి కిందనున్న గుంతకల్లు బ్రాంచ్‌ కాలువకుగానీ, మిడ్‌పెన్నార్‌ ఉత్తర, దక్షిణ కాలువలకు నీటిని ఎప్పుడు విడుదల చేస్తారన్న అంశాలూ వెల్లడించకపోవడం గమనార్హం.
అన్నీ కాకి లెక్కలే...?
నీటి కేటాయింపులు చూస్తే అన్నీ కాకిలెక్కలేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2022-23 సంవత్సరంలో మంచి వర్షాలొచ్చి దీంతో తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు 36.50 టిఎంసిల నీరొచ్చింది. ఇందులో తాగునీటికి పది టిఎంసిలు కేటాయించగా, 28.821 టిఎంసిలు సాగునీటికి వినియోగించినట్టు అధికారిక నివేదికల్లో పేర్కొన్నారు. సాధారణంగా ఒక టిఎంసి నీటిని పది వేల ఎకరాల ఆయకట్టుకు అందివ్వ వచ్చునన్నది అధికారిక అంచనాయే. కాని గతేడాది 28.821 టిఎంసిలు సాగునీటిని వినియోగించమని చెబుతున్నప్పటికీ హెచ్‌ఎల్‌సి కింద సాగైన భూమి మాత్రం 85 వేల ఎకరాలు మాత్రమే. సాధారణంగా అయితే 2.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఈ నీరు సరిపోతుంది. సాగైంది 85 వేలు మాత్రమే కావడం గమనార్హం. ఇకపోతే ఈ ఏడాది 2023-24కుగానూ ఇప్పటికున్న పరిస్థితుల అంచనా ప్రకారం 26.828 టిఎంసిలు నీటి కేటాయింపులు జరిపారు. ఇదే వాతావరణ పరిస్థితులు కొనసాగితే మరో మూడు టిఎంసిలు తగ్గే సూచనలున్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో పది టిఎంసిలు తాగునీటికిపోనూ 16 టిఎంసిలు సాగునీటికి కేటాయించారు. ఇందులో ఆరు టిఎంసిలు ప్రవాహ నష్టం జరుగనుంది. పది టిఎంసిలు మిగులుంది. ఈ పది టిఎంసిలతో ఈసారి లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరిస్తామని ప్రతిపాదించారు. గతేడాది 28 టిఎంసిలు వచ్చినా 85 వేల ఎకరాలకే నీరిచ్చారు. ఈసారి తక్కువ నీరొచ్చినా ఎక్కువ ఆయకట్టుకు ఏ విధంగా నీరిస్తారన్నది ప్రశ్నార్థకంగా ఉంది.
సమావేశంలో ప్రజాప్రతినిధుల స్పందన...
ఐఎబి సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పలు సమస్యలపై ప్రస్తావన చేశారు. వారి నియోజకవర్గాల్లో సాగునీటి, తాగునీటి సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చి వాటిని పరిష్కరించాలని కోరారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ హెచ్‌ఎల్‌సి పరిధిలో కేటాయించిన 26.828 టీఎంసీలలో 10 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించాలని, మిగిలిన 16.828 టీఎంసీలను నీటిని ఆరుతడి ఆయకట్టుకు సరఫరా చేసేలా చూడాలన్నారు. హెచ్‌.ఎన్‌.ఎస్‌.ఎస్‌ పరిధిలో కేటాయించిన 40 టీఎంసీలలో 4 టీఎంసీల నీరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు ఉపయోగించాలని సూచించారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్‌ మాట్లాడుతూ వర్షభావ పరిస్థితుల్లో రైతులకు మేలు చేసే చర్యలు తీసుకోవాలన్నారు. భైరవానితిప్ప ప్రాజెక్టు కింద పెండింగ్‌ భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే సాగు చేసిన ఉద్యాన, ఇతర పంటలు కాపాడుకోవాలన్నారు. ఇందుకోసం యాక్షన్‌ ప్రణాళిక రూపొందించాలన్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో 300 కోట్ల రూపాయల ఖర్చుతో రెయిన్‌ గన్స్‌ కొనుగోలు చేశారని, అవి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయన్న దానిపై పరిశీలన చేసి, దీనిపై విజిలెన్స్‌ విచారణ చేపించాలన్నారు.ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కేసీ కెనాల్‌ డైవర్షన్‌ కింద కేటాయించిన 10 టీఎంసీల నీటిని జిల్లా హక్కుగా ఖచ్చితంగా తీసుకోవాలన్నారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ హెచ్‌ఎల్‌సి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కింద కేటాయించిన నీటిని ఆచితూచి వాడుకోవాలన్నారు. తాగునీటి కోసం కేటాయించిన నీటిలో హెచ్‌ఎల్‌సి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కింద 50 శాతం చొప్పున నీటిని తీసుకోవాలని, దీని ద్వారా ఆయకట్టుకు కూడా నీరు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కర్ణాటకలో కడుతున్న ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేసేలా సమావేశంలో తీర్మానం చేయాలన్నారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ ముందుగా చెరువులను నింపి తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఫేస్‌2 కింద నీటిని విడుదల చేసి రాప్తాడు నియోజకవర్గంలోని చెరువులను నింపాలన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ పీఏబీఆర్‌ కుడి కాలువ కింద ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో 16 చెరువులకు నీరు అందించాలన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ మిడ్‌ పెన్నార్‌ గేట్లు మరమ్మతులకు గురవుతున్నారని, నీరు వథా కాకుండా గేట్ల మరమ్మత్తులు చేపించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఒ ప్రశాంత్‌ కుమార్‌, ఆర్డీవో మధుసూదన్‌, అగ్రికల్చర్‌ జెడి ఉమామహేశ్వరమ్మ, హార్టికల్చర్‌ డిడి రఘునాథరెడ్డి, ఏపీఎంఐపీ పీడీ ఫిరోజ్‌ ఖాన్‌, ఫిషరీష్‌ డిడి శాంతి, ఏపీ ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సురేంద్ర, నగరపాలక సంస్థ కమిషనర్‌ భాగ్యలక్ష్మి, ఎల్డిఎం సత్యరాజ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, హెచ్‌ఎల్‌ సి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.