సబ్సిడీపై అందిస్తున్నాం, స్పందన బాగుంది - ప్రజాశక్తి' ముఖాముఖిలో డిఎఫ్‌ఒ హిమశైలజ
ప్రజాశక్తి - ఏలూరు టౌన్
పర్యావరణ సమతుల్యతను కాపాడాలని, అడవులు 70 శాతం మేర ఉండాలని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటడమే దానికి పరిస్కారమార్గంగా ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలో అడవులను పెంచేందుకు సామాజిక వన విభాగం కృషి చేస్తోంది. రోడ్ల వెంబడి, గృహసముదాయాలు, కాలనీలు, పొలంగట్లు తదితర చోట్ల సామాజిక వనాలను అభివృద్ధి చేసేనదుకు కృషి చేస్తోంది. ఈ శాఖ మొక్కలను పెంచి ప్రజలకు కూడా నామ మాత్రపు ధరకు అందజేస్తుంది. ఈ నేపథ్యంలో సామాజిక వనాల ఏర్పాటు ప్రక్రియ ఎలా జరుగుతుంది. ప్రజల సహకారం ఎలా ఉంది ఇత్యాది అంశాలను 'ప్రజాశక్తి' ముఖాముఖిలో జిల్లా సోషల్ ఫారెస్ట్రీ (డిఎఫ్‌ఒ) ఎం.హిమశైలజ వివరించారు.
ప్రశ్న : జిల్లాలో సామాజిక వనాల పెంపు ఎలా సాగుతోంది?
జిల్లాలో ఆడవుల పెంపు కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. టెర్రిటోరియల్, సోషల్ ఫారెస్ట్రీ, వైల్డ్ లైఫ్ విభాగాల ద్వారా అవసరమైన ప్రాంతాల్లో మొక్కలు నాటడం, అడవులు పెంచడానికి కృషి చేస్తోంది. సామాజిక వన విభాగం పరిధిలో గతంలో అనేక కార్యక్రమాల ద్వారా మొక్కలు నాటాము. నరేగా, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ ద్వారా మొక్కలు నాటడం, పెంచడం జరిగేది. ఈ ఏడాది కేవలం కంపాస్ పథకం ద్వారా మాత్రమే నర్సరీల్లో మొక్కలు ఉత్పత్తి చేసి, ప్రజలకు అందిస్తున్నాం.
ప్రశ్న : ఈ ఏడాది ఎన్ని లక్షల మొక్కలు అందించారు?
జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రజలకు 7.8 లక్షల మొక్కలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇప్పటి వరకూ చాలావరకూ పూర్తయింది. నిమ్మ, దానిమ్మ, మామిడి, వేప, ఉసిరి వంటి మొక్కలున్నాయి.
ప్రశ్న : జిల్లాలో ఎన్ని నర్సరీల్లో మొక్కలు అందుబాటులో ఉన్నాయి?
జిల్లాలో ఏడు చోట్ల అంటే శనివారపుపేట, మర్లగూడెం, బుట్టాయగూడెం, తడికలపూడి, పి.పురం, నామవరం, వెంకట్రామన్న గూడెం, బత్తులవారిగూడెం నర్సరీల్లో మొక్కలుపెంచాం. మొత్తం పది నర్సరీలుండగా, కంపాస్ పథకంలో విడుదలైన నిధులు, కలెక్టర్ అధ్యక్షతన ఉన్న కమిటీ నిర్ణయం మేరకు 7.8 లక్షల మొక్కలను ఏడు నర్సరీల్లో పెంచడం జరిగింది.
ప్రశ్న : మొక్కలు ఎవరెవరికి అందిస్తున్నారు?
మొక్కలు ఎవరైనా తీసుకోవచ్చు. అయితే కంపాస్ పథకంలో సబ్సిడీపై మాత్రమే మొక్కలు ఇస్తున్నాము. టేకు మొక్క ఒక్కోటి రూ.ఐదు చొప్పున, ఇతర మొక్కలు రూ.రెండు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు నకలు తెచ్చి మొక్కలు సబ్సిడీపై తీసుకెళ్లొచ్చు. 15 రోజులుగా మొక్కలు అందిస్తున్నాము. గతంలో నరేగాలో పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రామ పంచాయతీలకు ఉచితంగా పంపిణీ చేశాము. ఇప్పుడు ఎవరైనా సబ్సిడీ మీద తీసుకువెళ్లాల్సిందే. స్పందన బాగుంది.
ప్రశ్న : రోడ్ల వెంబడి మొక్కలు నాటే కార్యక్రమం ఎంత వరకు వచ్చింది?
జిల్లాలో పది కిలో మీటర్ల పొడవునా మొక్కలు నాటాలని జిల్లా కమిటీ నిర్ణయించింది.
ప్రశ్న : జిల్లాలో సామాజిక వనవిభాగానికి ఉద్యోగులు, సిబ్బంది కొరత ఉందని అంటున్నారు?
జిల్లాలో అలాంటి సమస్య లేదు. సరిపడా సిబ్బంది ఉన్నారు.










