May 04,2023 22:44

pariseelistunna panchakarla rangarao

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
కంకిపాడు : అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు దొరకు వెంటనే కొనుగోలు చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం కృష్ణాజిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కంకిపాడు మండలం మద్దూరు, కాసర్నేని వారి పాలెం గ్రామాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను కౌలు రైతు సంఘం, రైతు సంఘం ప్రతినిధులు పరిశీలించారు. అనంతరం రంగారావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మధ్యవర్తులు, వ్యాపారులు ధరలు తగ్గించి రూ.1960 మద్దతు ధర ఉన్న మొక్కజొన్నను వర్షాలకు ముందే రూ.1700 మించి కొనుగోలు చేయలేదన్నారు. వర్షాలతో పంటను కొనుగోలు చేయటానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వ మాత్రం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామనీ, పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా చెబుతున్నారే తప్ప అధికారులు పొలాల్లోకి వచ్చి పంటలను పరిశీలించడం లేదన్నారు. మరో తుఫాను ప్రమాదం పొంచి ఉన్న హెచ్చరికలతో రైతులు దిక్కు తొచని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెట్టకుండా వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు పోతాబత్తిన దుర్గాప్రసాద్‌, పీతా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.