ప్రజాశక్తి-ఆలూరు
మండలంలోని కమ్మరచేడు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి మొహర్రం వేడుకల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఘర్షణ పడ్డారు. గ్రామంలో బీసీ కాలనీలో ఉన్న పీర్ల చావిడి దగ్గర ఎస్సీలు అలాయిబలాయి ఆడుతుండగా కాళ్లు తొక్కారనే కారణంతో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. తర్వాత ఇరువర్గాలు ఒకరిపైఒక్కరు కర్రలతో, తప్పెళ్లతో, రాళ్లతో దాడులు చేసుకున్నారు. దాదాపు అరగంట పాటు ఇరువురు పరస్పరం దాడులు చేసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆలూరు ఎస్‌ఐ డాక్టర్ నాయక్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఘర్షణను నివారించే ప్రయత్నం చేశారు. ఇరువర్గాలు ఆవేశంతో వాదనలకు దిగి మహిళలు కారం, రాళ్లు తెచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పత్తికొండ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఆలూరు సిఐ వెంకటేశ్వర్లు రెండు వర్గాలకు సర్ది చెప్పారు. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి ఘర్షణలూ చోటు చేసుకోకుండా స్పెషల్ పార్టీ పోలీసులతో పికెట్ ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. శనివారం పత్తికొండ ఆర్‌డిఒ మోహన్ దాస్, డిప్యూటీ తహశీల్దార్ విజరు కుమార్, ఆర్‌ఐ బసన్న గౌడ్, పంచాయతీ కార్యదర్శి జిలానీ గ్రామంలో పర్యటించారు. ఘర్షణలకు వెళ్లకుండా ఉండాలని, కేసులు నమోదైతే కుటుంబం ఆర్థికంగా దెబ్బతిని పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని యువతకు, మహిళలకు, ప్రజలకు తెలిపారు. పండగలను సామరస్యంగా చేసుకోవాలని తెలిపారు.
గ్రామస్తులతో మాట్లాడుతున్న డీఎస్పీ, సిఐ, ఎస్‌ఐ










