Sep 27,2023 15:55

ఇంఫాల్‌ :   మణిపూర్‌ మరోసారి భగ్గుమంటోంది. ఇంఫాల్‌లోని సింజెమీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంగళవారం రాత్రి విద్యార్థులు, రాపిడ్‌ యాక్షన్‌ పోర్స్‌ (ఆర్‌ఎపి)కి మధ్య జరిగిన ఘర్షణలతో ఇంఫాల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జులై 6న అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల హత్యను నిరసిస్తూ మంగళవారం విద్యార్థులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. నిరసనకారులను అడ్డుకునేందుకు ఆర్‌ఎపి రబ్బరు బుల్లెట్లు, టియర్‌గ్యాస్‌ను ప్రయోగించడంతో 45 మంది గాయపడ్డారు.

దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరిచినప్పటికీ .. సింజెమీ ప్రాంతంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంఫాల్‌లోని విద్యా సంస్థలకు బుధవారం సెలవు ప్రకటించింది. మణిపూర్‌ పోలీసులతో పాటు సిఆర్‌పిఎఫ్‌, ఆర్‌ఎపిలను మోహరించినట్లు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కర్ఫ్యూ ఆంక్షలను సడలించింది. ఇంఫాల్‌ తూర్పు, ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాల్లో మందులు, ఆహారంతో సహా అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలను సడలిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలపై కూడా తాత్కాలికంగా నిషేధం విధించింది. అక్టోబర్‌ 1 సాయంత్రం 7.45 గంటల వరకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.