ఒక కమ్యూనిటీ పట్ల పక్షపాత ధోరణి
మణిపూర్ మీడియా కథనాలపై ఆర్మీ లేఖ
న్యూఢిల్లీ : భారత సైన్యం ఆహ్వానం మేరకే తాము మణిపూర్‌లో పర్యటించి, నివేదిక రూపొందించామని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఇజిఐ) సుప్రీంకోర్టుకు తెలియజేసింది. జులై 12న సైన్యం, గిల్డ్ అధ్యక్షురాలు సీమా ముస్తఫాకు రాసిన లేఖను విడుదల చేసింది. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై స్థానిక మీడియా ఇచ్చిన వార్తా కథనాలను పరిశీలించాల్సిందిగా ఇజిఐని సైన్యం ఆ లేఖలో కోరింది. వాస్తవాలను పూర్తిగా తప్పుదారి పట్టిస్తూ, జర్నలిస్టుల నైతిక ప్రమాణాలు, విలువలను ఉల్లంఘిస్తూ స్థానిక మీడియా వ్యవహరించిందని, హింసను మరింతగా రెచ్చగొట్టేందుకు దోహదపడిన ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి కావచ్చని ఆ లేఖ పేర్కొంది. జనరల్ ఆఫీసర్ కమాండింగ్ తరపున ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ వింగ్‌కి చెందిన కల్నల్ అనురాగ్ పాండే సంతకంతో ఈ లేఖ వెలువడింది. ఒక కమ్యూనిటీకి అనుకూలంగా మరో కమ్యూనిటీకి వ్యతిరేకంగా మీడియా వ్యవహరించిన తీరు చాలా స్పష్టంగా రోజువారీ కథనాల్లో కనిపిస్తోందని ఆ లేఖ పేర్కొంది. ఎడిటర్స్ గిల్డ్ అక్కడ పరిస్థితులను పరిశీలించి ఇచ్చిన నివేదికలో కూడా ఈ పక్షపాత ధోరణిని ప్రస్తావించింది. మణిపూర్‌లో అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో ఇంటర్‌నెట్‌పై నిషేధం వున్నప్పటికీ హింస మరింతగా చెలరేగేందుకు దోహదపడిన ప్రధాన కారణాల్లో స్థానిక మీడియా వాస్తవాల వక్రీకరణ కూడా ఒక కారణం కావచ్చని ఆ లేఖ పేర్కొంది. అందువల్లే జర్నలిస్టులు, మీడియా సంస్థలకు నిర్దేశించిన మార్గదర్శకాలను, నైతిక సూత్రాలను స్థానిక మీడియా సంస్థలు ఉల్లంఘించాయా? లేదా? అని నిర్ధారించడానికి పై వార్తా కథనాలను పరిశీలించాల్సిందిగా కోరుతున్నట్లు ఆ లేఖ పేర్కొంది. మణిపూర్ మీడియా ఏకపక్షంగా కథనాలు ఇచ్చినట్లు కనిపిస్తోందని, వాటిపై సముచితమైన చర్య తీసుకోవాల్సిందిగా ఆ లేఖ కోరింది. ఇందుకు సంబంధించిన వార్తా క్లిప్పింగ్స్‌ను కూడా జత చేసింది. రెండు కమ్యూనిటీల మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతున్న సమయంలో కనీసం శాంతి నెలకొనేందుకు అవకాశం ఇచ్చేలా స్థానిక మీడియా వ్యవహరించి వుండాల్సిందని ఆ లేఖ అభిప్రాయపడింది.











