Sep 30,2023 21:21
  • బీరేన్‌ ప్రభుత్వం విఫలమైంది

ఇంఫాల్‌ : మణిపూర్‌లో అల్లర్లను ఆపడంలో బీరేన్‌సింగ్‌ ప్రభుత్వం విఫలమైందని బిజెపి రాష్ట్ర శాఖ తీవ్రంగా విమర్శించింది. ముఖ్యమంత్రి వ్యవహార తీరుపై పార్టీ రాష్ట్ర నేతలు అసంతఅప్తి వ్యక్తం చేస్తూ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాకు లేఖ రాశారు. పరిస్థితిని అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, రోజురోజుకీ పరిస్థితి దిగజారుతోందని వారు ఆ లేఖలో వివరించారు. ప్రధానిని కలిసి ఇక్కడి పరిస్థితి నివేదించేందుకు తమకు అవకాశమివ్వాలని కోరారు. . నిర్వాసితులకు తక్షణమే పునరావాసం కల్పించాలని, జాతీయ రహదారిపై దిగ్బంధనాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు. ఈ లేఖపై బిజెపి మణిపూర్‌ అధ్యక్షురాలు శారదా దేవితో పాటు ఎనిమిది మంది రాష్ట్ర కార్యదర్శులు సంతకాలు చేశారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. మణిపూర్‌లో బీరేన్‌సింగ్‌ ప్రభుత్వం మైతీలను మైనార్టీ కుకీలపైకి ఎగదోస్తూ మత ఘర్షణలను ప్రేరేపించిందని, కాబట్టి ముఖ్యమంత్రిని తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను బిజెపి అధినాయకత్వం మొండిగా తిరస్కరించింది. ఇప్పుడు మణిపూర్‌ బిజెపి నేతలే ఆయనను తప్పించాలని కోరుతున్నారు. ఈ లేఖపై ౖ మోడీ కానీ, అమిత్‌షా కానీ నోరు మెదపడం లేదు.