Sep 18,2023 00:35

విగ్రహాన్ని తీసుకెళుతున్న యువకులు


ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: పల్లె, పట్నం, చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ ఎదురు చూస్తున్న వినాయక చవితి రానే వచ్చింది. ఈనెల 18 నుంచి చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అల్లూరి జిల్లా వ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లో, గ్రామాల్లో భక్తులు మండపాల ఏర్పాటు, విగ్రహాల కొనుగోళ్లలో నిమగమయ్యారు. జిల్లా కేంద్రం పాడేరు పట్టణంతో పాటు ఏజెన్సీ వ్యాప్తంగా ఈ ఏడాది వినాయక చవితిని ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. వినాయక పండుగను పురస్కరించుకొని మండపాలు రూపుదిద్దుకుంటున్నాయి. మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీలు, యువత నిమగమయ్యారు. చిన్నల నుంచి పెద్దల వరకు గణేష్‌ మండపాలను అలంకరించుకునే పనుల్లో ఉన్నారు. ఈనెల 18 నుంచి భక్తుల పూజలు అందుకునేందుకు పాడేరు పట్టణంలో భారీ విగ్రహాలను, వివిధ ఆకారంలో గణేష్‌ విగ్రహాలు అమ్మకాలకు సిద్ధంగా ఉంచారు. మైదాన ప్రాంతాల నుంచి తీసుకువచ్చినవి ఇక్కడ విక్రయిస్తారు. ఈసారి విగ్రహాల ధరలు ఆకాశాన్నంటాయి. ఒక్కో విగ్రహానికి గతేడాదితో పోలిస్తే 30 నుంచి 40శాతం రేట్లు పెరిగాయి. వీటిని కొనుగోలు చేసేందుకు భక్తులు భయపడుతున్నారు. జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ఇక్కడకు వచ్చి విగ్రహాలను కొనుగోలు చేసి వాహనాల్లో తీసుకెళ్తుంటారు. బొలెరోలు, ఆటోల్లో, ఇతర వాహనాల్లో వినాయక ప్రతిమలను గ్రామాలు, పట్టణాల్లోని వీధులకు తరలిస్తున్నారు.
పెరిగిన భారం..
ముడిసరుకులు, అద్దెలు, కూలీల రేట్లు, రంగుల ధరలు ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతుండడంతో పాటు ఖర్చులు కూడా పెరిగాయి. ఈసారి విగ్రహాల ధరలూ అమాంతం పెంచేశారు. మూడేళ్ల క్రితం రూ.3 వేలు ఉన్న విగ్రహాలు ఈ ఏడాది రూ.5 నుంచి రూ.7 వేల వరకు పెరిగాయి.
మార్కెట్లో చిరు వ్యాపారుల తాకిడి...
పాడేరు : వినాయక చవితి సందర్భంగా జిల్లా కేంద్రం పాడేరు లోని మార్కెట్‌ ఆవరణ అంతా చిరు వ్యాపారుల తాకిడి ఎక్కువైంది. వినాయకునికి ప్రీతిపాత్రమైన రకరకాల ఫలాలు, పత్రి, వెదురు బద్దలతో తయారుచేసే పాలవెల్లులు ప్రమిదలు అమ్మకాలను చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున నిర్వహించారు. మెయిన్‌ రోడ్డు సినిమా హాల్‌ జంక్షన్‌ అంబేద్కర్‌ సెంటర్లో తదితరచోట్ల పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. వినాయక ప్రతిమలను భారీగా విక్రయించారు. పదివేల రూపాయల పైచిలుకు విలువైన పది అడుగుల నుంచి 15 అడుగుల ఎత్తులో రూపొందించిన వినాయక విగ్రహాలు మార్కెట్లో విక్రయించారు. గ్రామాల్లో వినాయక ఉత్సవాల్ని నిర్వహించేందుకు వాహనాల్లో భారీ వినాయక విగ్రహాలని కొనుగోలు చేసి తరలించారు.
మట్టి గణపతిని పూజించాలి
మట్టి వినాయకుని ప్రతిమల్ని భక్తులు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లోనూ వీధుల్లోనూ ప్రతిష్టించుకుని పూజించి తరించాలని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. మోద మణికిరణ్‌ అన్నదాన ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మోదకొండమ్మ అమ్మవారి గుడి వద్ద మట్టి వినాయకుని ప్రతిమల్ని ఎమ్మెల్యే భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కోటగుల్లి సింహాచలం నాయుడు ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం అన్నదాన ట్రస్ట్‌ ప్రతినిధులు శివరాత్రి శ్రీనివాస్‌ బొడ్డు ముకుందరావు సిద్ధనాతి కొండలరావు ఉప్పల వెంకటరత్నం కారం దేవుడు పలాస బాలన్న కిషోర్‌ అల్లాడ నగేష్‌ పాల్గొన్నారు.
సీలేరు: జికె.వీధి మండలం సీలేరులో వినాయక చవితి ఉత్సవాల సందడి నెలకొంది. ఆదివారం సంత కావడంతో మారుమూల గ్రామాల నుంచి గిరిజనులు వినాయక విగ్రహాలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. గణనాథుని పూజకు కావాల్సిన వివిధ రకాల పండ్లు ఎలమ, మారేడు, కాయలు చెరకలు పూజా సామాగ్రి విరివిగాకొనుగోలు చేశారు. సీలేరు పురవీధుల్లో వినాయక మండపాలు ముస్తాబు కావడంతో, పండగ శోభ అలుముకుంది. దుర్గా వీధి, మార్కెట్‌ సెంటర్లో లక్ష్మీ గణపతి, వర్తక సంఘం, శివాలయం, అల్లూరి వీధి, మసీదు లైన్‌, తదితరు వీధుల్లో గణనాథానికి మండపాలు ఏర్పాటు చేసి వివిధ రంగులతో అలంకరించారు పండుగ సందర్భంగా పూజాసామగ్రి, పండ్లు, ఇతర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోయినా, సరిపడా సామగ్రి కొనుగోలు చేశారు.