Sep 06,2023 20:46

జలమయమైన బైపాస్‌ కాలనీ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. పార్వతీపురం, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, వీరఘట్టం తదితర మండలాల్లో కుండపోత వర్షం కురిసింది.
ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్‌ : 
పట్టణంలో బుధవారం సాయంత్రం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7గంటలకు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. కుండ పోతగా కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారితో పాటు పలు వీధులు, రహదారులు జలమయమయ్యాయి. వర్షపు నీరు, కాలువల్లో మురుగునీరు రహదారిపైనే ప్రవహించడంతో పాదచారులు, వాహన చోదకులు నానా అవస్థలు పడ్డారు. ద్విచక్రవాహనాలు నీటమునిగాయి. బైపాస్‌ కాలనీ, సౌందర్య థియేటర్‌ కాలనీ, నందుమూరి కాలనీ, భారతీనగర్‌, దేవీనగర్‌తో పాటు పలు కాలనీల్లో వరదనీరు భారీగా చేరింది. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు తీవ్ర అవస్థలుపడుతున్నారు. పట్టణంలో వరహాలగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. రాత్రంతా ఏకధాటిగా వర్షం కురిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
వరద నీటిలో బైపాస్‌ కాలనీ
ఇదిలా ఉండగా ప్రతి ఏటా వర్షాకాలంలో బైపాస్‌ కాలనీకి వరదనీటి ముంపు తప్పడం లేదని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన్యం జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బైపాస్‌ కాలనీలో వరదనీరు భారీగా చేరి బయటకు వెళ్లేందుకు అవకాశం లేక రహదారిపైనే నిలిచిపోవడంతో మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు కాలనీలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీటితో పాటు వరదనీరు పలు నివాస గృహాల్లోనికి, రహదారికి ఆనుకొని ఉన్న షాపుల్లోనికి వరద నీరు చేరడంతో ప్రజల నానా అవస్థలు పడ్డారు. బైపాస్‌ కాలనీలో కాలువలు సక్రమంగా నిర్మించకపోవడంతో వాడుక నీరుతో పాటు వర్షపు నీరు బయటకు ప్రవహించేందుకు అవకాశం లేకపోవడంతో ప్రతిఏటా వర్షాకాలంలో కాలనీ వాసులకు ఈ సమస్య తప్పడం లేదు. శాశ్వత పరిష్కారం చేపట్టేందుకు సంబంధిత మునిసిపల్‌ అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ప్రతి ఏటా బైపాస్‌ కాలనీలో ఈ సమస్య పునరావృతమవుతుంది. వరహాలగెడ్డపై ఉన్న ఆక్రమణలతో పాటు, బైపాస్‌ రోడ్డు రహదారి వైపు ఉన్న కల్వర్టులు కొందరు రియల్‌ ఎస్టేట్‌ యజమానులు కప్పి వేయడంతో వరద నీరు పోయేందుకు అవకాశం లేకుండా పోయిందని కాలనీవాసులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన బైపాస్‌ కాలనీ వైపు ఉన్న కల్వర్టుల్లో ఉన్న ఆక్రమణలను తొలగించి వాడుక నీటితో పాటు వరద నీరు బయటకు పోయేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని బైపాస్‌ కాలనీ వాసులు కోరుతున్నారు.
సీతంపేట : మండల కేంద్రంలో బుధవారం కుండపోత వర్షం కురిపిస్తుంది ఇప్పటికే ఏజెన్సీలో సరైన వర్షాలు కురకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. ఏజెన్సీలో మధ్యాహ్నం రెండు గంటల నుండి వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గెడ్డలు, వాగులు బావులు ఈ వర్షంతో పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే వరి నాట్లు పొట్ట దశకు చేరుకున్నాయి. వర్షం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. సరైన సమయంలో వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుమ్మలక్ష్మీపురం: మండలంలో బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. గత 20 రోజులుగా ఉదయం వేళ ఎండలు, సాయంత్రం వేళ మబ్బులతో ప్రజలు వర్షం కోసం ఎదురు చూశారు. వర్షాలు లేక మండే ఎండలతో వరి పైరు ఎండిపోతున్న సమయంలో వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కురిసిన వర్షంతో పంట పొలాలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని అంటున్నారు.
పొంగిపొర్లు తున్న వెంకమ్మ సాగరం
వీరఘట్టం : మండలంలోని యు.వెంకంపేట గ్రామపంచాయతీ పరిధిలోని వెంకమ్మ సాగరం పొంగిపొర్లుతుంది. మండలంలోని గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు సాగరంలోకి చేరడంతో సాగునీరు వృథాగా బయటకు పోతుంది. అలాగే నడుకూరు గ్రామ సమీపములను సీతమ్మ సాగరం సాగునీరు వృథాగా బయటకు పోతుంది.