Aug 14,2023 23:35

ప్రజాశక్తి-అమలాపురం
మణిపూర్‌ రాష్ట్రంలో జరుగుతున్న మారణకాండ అరికట్టి హింసకు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని, మణిపూర్‌ ప్రజలకు రక్షణ కల్పించాలని, ఆ రాష్ట్రంలో శాంతి చేకూర్చే విధంగా కేంద్రం చర్యలు చేపట్టాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. బిజెపికి స్వాతంత్య్రం గురించి మాట్లాడే అర్హత లేదని దేశంలో కాంగ్రెస్‌ పార్టీ కంటే ముందు కమ్యూనిస్టులు స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్‌ వద్ద జరిగిన జన జాగరణ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు అన్నారు. దేశ స్వాతంత్య్రం ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని పరిరక్షించు కోవాలని అన్నారు.స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నేడు మేమే దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చామని ప్రచారం చేసుకోవడం దారుణం అని అన్నారు. మత విద్వేషాన్ని భాగోద్వేగాన్ని రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే బిజెపి ప్రభుత్వం అజెండా అని అన్నారు. ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు ప్రాణాలు ఆర్పించి స్వాతంత్య్రం సాధించారన్నారు. కమ్యూనిస్టు పార్టీ పరిపాలిస్తున్న కేరళలో మతానికి, రాజకీయానికి ముడి పెట్టరని మత స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. బిజెపి ప్రభుత్వం సావర్కర్‌ ను స్వాతంత్య్ర సమరయోధుడిగా చిత్రీకరిస్తోందన్నారు. భారతదేశంలో మత స్వేచ్ఛ కావాలని భిన్నత్వంలో ఏకత్వంగా నివసించే దేశంలో బిజెపి మతాల కులాలు ప్రాంతాలంటూ విభజించి పాలిస్తోందని అన్నారు. తెలంగాణలో సాయుధ పోరాటం కమ్యూనిస్టు ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్య్రం లభించాయని ఆయన గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీ మాత్రమే స్వాతంత్య్రం ఉద్యమానికి నిజమైన వారసులని చెప్పుకునే ధైర్యం ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి. దుర్గాప్రసాద్‌, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.రామచంద్రరావు, బుంగ సత్యనారాయణ, .వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సఖిలే సూర్యనారాయణ, జి.దైవకప, పాము బాలయ్య, తాడి శ్రీరామమూర్తి, సిఐటియు భవననిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు బీమాల శ్రీను, మున్సిపల్‌ వర్కర్స్‌ నాయకులు నిమ్మకాయల వెంకటేష్‌, బేవరేజ్‌ యూనియన్‌ నాయకులు నక్కా సతీష్‌, పల్లి రామకృష్ణ, గుద్దటి వెంకటేశ్వరరావు, సీరెడ్డి బాబ్జి, మరియమ్మ, పర్వతాలు పిడిఎస్‌యు నాయకులు ఎం.శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.