ప్రజాశక్తి - ఆదోని
మణిపూర్‌లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు హేయమైనవని ఆదోని క్రైస్తవ సంఘాల పాస్టర్లు బెనర్జీ రాజు, ఆనంద్ రాజు, ఎమ్మెస్ రావు, జోసెఫ్ విక్లీప్, ఫాదర్ రెవరెండ్ కోల విజయరాజు, రాజు విమర్శించారు. శుక్రవారం రాజశ్రీ హాలులో పాస్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 79 రోజులుగా మణిపూర్ రాష్ట్రంలో కూకి, నాగా తెగలపై మతోన్మాదులు దాడులు చేస్తూ హింసలకు గురి చేయడం అన్యాయమన్నారు. 1500 మంది మరణించగా, 500 క్రైస్తవ సంఘాలను కూల్చివేసి, 10 బైబిల్ కళాశాలలను తగులబెట్టడం అన్యాయమని తెలిపారు. ముగ్గురు మహిళలను నగంగా ఊరేగించడం దేశానికే అవమానంగా భావిస్తున్నామన్నారు. గిరిజన తెగలకు చెందిన మహిళలకు ఎంత అవమానం జరిగినా దేశ ప్రథమ పౌరులైన రాష్ట్రపతి స్పందించకపోవడం బాధాకరమన్నారు. రిజర్వేషన్ ముసుగులో ఇరు వర్గాలను రెచ్చగొట్టి మత ఘర్షణలుగా బయటి ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నాలు చేయడం సమంజసం కాదన్నారు. ఈ దాడులపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, బజరంగ్ దళ్ కుట్ర ఉందని విమర్శించారు. ప్రధాని మోడీ అన్ని మతాలను సమానంగా చూడకుండా వివక్షత చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారని, శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరారు. క్రైస్తవ సంఘ పాస్టర్లు విక్టర్ పాల్ ఫిలిప్, ఆల్బర్ట్, తిమోతి, ఆశీర్వాదం, రాజు, కిరణ్‌కుమార్, శాంతకుమార్, సుజ్ఞానమ్మ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఆదోని క్రైస్తవ సంఘాల పాస్టర్ బెనర్జీ










