Jul 30,2023 21:04

నంద్యాలలో కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు

మణిపూర్‌ నిందితులను కఠినంగా శిక్షించాలి
- కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ
ప్రజాశక్తి - నంద్యాల
  
మణిఫూర్‌లో మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ చింతల మోహన్‌ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఊకోటు వాసు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ సంఘటనలను వ్యతిరేకిస్తూ ఆదివారం కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్‌లో కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపూర్‌ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటన భారతదేశ ప్రజలను, స్త్రీలను తీవ్రంగా కలిచివేసిందన్నారు. దీనిని కాంగ్రెస్‌ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మణిపూర్‌ ఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, అల్లర్లను ఆపాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌ రాష్ట్రంలోని అడవి ప్రాంతంలో ఎంతో విలువైన ఖనిజ సంపదను దోచుకోవడానికి పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి వెనక ఉండి రెండు కులాల మధ్య వైర్యాన్ని రెచ్చగొడుతున్నారని అన్నారు. అటవీ ప్రాంతం మొత్తం ఖాళీ చేయించే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మీద విమర్శించిన వారిపై రకరకాల కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడానికి వాడుతున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను మణిపూర్‌కు ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు. అక్కడ జరుగుతున్న సంఘటనలను నియంత్రించడానికి సైన్యాన్ని ఎందుకు ఉపయోగించడం లేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సేవాదళ్‌ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్‌ ఖాన్‌, సీనియర్‌ మైనార్టీ నాయకులు చాబోలి సలాం, ఐయుఎంఐ జిల్లా అధ్యక్షులు మౌలానా, కరిముల్లా, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు. బనగానపల్లె : మణిపూర్‌ మరణకాండకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని జమాఅతే ఇస్లామి హింద్‌ మండల అధ్యక్షులు మీర్జా అలీ బేగ్‌, ఫాదర్‌ రమేష్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఖాన్‌ రైస్‌ మిల్లు నుండి పెట్రోల్‌ బంక్‌ కూడలి వరకు జమాఅతే ఇస్లామి హింద్‌ ఆధ్వర్యంలో మణిపూర్‌ మారణకాండకు వ్యతిరేకంగా ముస్లిం, క్రైస్తవ సంఘాలు, మహిళలు మానవతా ర్యాలీ నిర్వహించారు. పెట్రోల్‌ బంకు కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపూర్‌లో జాతుల మధ్య, కులాల మీద రాజకీయాల కోసం ఘర్షణలు పెట్టారని విమర్శించారు. మహిళలను నగంగా ఊరేగింపు నిర్వహించి, అత్యాచారం చేస్తున్నా అక్కడి పాలక పార్టీలు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పాస్టర్‌ ఆల్బర్ట్‌, పాస్టర్‌ మనోజ్‌, ఐవైఎం, ఎస్‌ఐఓ, ఎంపీజే, డబ్ల్యుపిఐ ఆర్గనైజేషన్లు, ముస్లిం క్రిస్టియన్‌ మహిళలు పాల్గొన్నారు.