ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : మణిపూర్ మానవీయ సంఘటనకు నైతిక బాధ్యతవహిస్తూ మణి పూర్ ముఖ్యమంత్రి, కేంద్ర హౌం మంత్రి, ప్రధాన మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కెవిపిఎస్ మరియు ప్రజా సంఘాలు, సిఐటియు అఖిల భారత మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కోనేరు సెంటర్ లో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ కష్ణా జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాజేష్ మాట్లాడుతూ మణిపూర్ లో జాతుల మధ్య మారణ హౌమాన్ని అరికట్టాలని, అక్కడ ప్రజల మధ్య శాంతి,రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మణిపూర్ లో మే మూడో తారీఖున హింస ప్రారంభమైతే 90 రోజులు వరకు ప్రపంచానికి తెలియకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ అనేక వీడియోలు ఉన్నాయని దానివల్ల నెట్ కనెక్షన్ చెక్ చేయడం జరిగిందని అనటం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. దాదాపు మూడు నెలల పాటు అరాచకం రాజ్యమేలుతుంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం పక్షవాతం వచ్చినట్లుగా అచేతనంగా ఉండిపోయిందని వెంటనే అక్కడ ప్రజలకు శాంతిని కలిగించాలని డిమాండ్ చేశారు.ఐద్వా కష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి వి జ్యోతి మాట్లాడుతూ మణిపూర్ లో శాంతి సామరస్యాన్ని పునరుద్దించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే గట్టి చర్యలు తీసుకోవాలని లేనిచో, దేశభద్రతకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం అవుతాయని జాతుల మధ్య వైరాన్ని వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొడాలి. శర్మ మాట్లాడుతూ మణిపూర్ లో మహిళలపై జరిగిన సంఘటన అమానుషమైనదని, కుక్కి మొయితీల మధ్య వైరాన్ని పరిష్కరించాలని, బిజెపి మతోన్మాదాన్ని ప్రజలందరూ ఐక్యంగా తిప్పి కొట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు ఎస్ ధనుంజయ రావు, ఎల్‌ఐసి యూనియన్ నాయకులు టి. చంద్రపాల్, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు బూర. సుబ్రహ్మణ్యం, సి హెచ్ జయరావు, ఐద్వా పట్టణ కార్యదర్శి కే సుజాత, పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎండీ యూనస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పి పవన్,ఎంఏ బెనర్జీ ప్రజానాట్య మండలి జిల్లా నాయకులు పి.నాగయ్య తదితరులు పాల్గొన్నారు










