ప్రజాశక్తి-కనిగిరి: టిడిపి కనిగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మన ఊరు మన ఉగ్ర అనే వినూత్న కార్యక్రమానికి కనిగిరి మండలం పునుగోడులో సోమవారం సాయంత్రం శ్రీకారం చుట్టారు. తొలుత చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా నిర్దోషిగా విడుదల కావాలని కోరుతూ గ్రామంలోని సిద్దేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన ఊరు మన ఉగ్ర కార్యక్రమం లోగోను ఆవిష్కరించారు. గ్రామ పరిధిలోని ఎస్సీ, ఎస్టి, ముదిరాజు పాలెంలో ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. దుర్మార్గపు వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి చేయని తప్పుకు శిక్ష అనుభవించేలా చేస్తూ రాక్షసానందం పొందుతున్న సీఎం జగన్మోహన్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు నంబల వెంకటేశ్వర్లు, నాయకులు ముచ్చుమారి చెంచిరెడ్డి, నుదురుపాటి సుబ్బయ్య, మాలపాటి ఓబుల్ రెడ్డి, షేక్ ఫిరోజ్, షేక్ అహ్మద్, తమ్మినేని వెంకట్ రెడ్డి, షేక్ బారాయి మామ్, తమ్మినేని సురేందర్ రెడ్డి, పాలూరి సత్యం, చింతలపూడి తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.










