Jun 28,2023 21:40

ఆటోనగర్‌ ప్రారంభ సభలో మాట్లాడుతున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

మంత్రి బుగ్గన పర్యటనలో అపశృతి
- తేనెటీగలు దాడి - 70 మందికి గాయాలు
- ముగ్గురి పరిస్థితి విషమం - కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలింపు
ప్రజాశక్తి - బేతంచెర్ల

       బేతంచెర్ల మండలం కనుమకింది కొట్టాల గ్రామం సమీపంలో బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. కనుమకింది కొట్టాల గ్రామ సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన బిల్వ స్వర్గం గుహలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మంత్రి పరిశీలన చేయడానికి వెళ్లారు. గుహల్లో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. వెంటనే మంత్రికి రక్షణగా సెక్యూరిటీ సిబ్బంది టవళ్లతో కప్పి నిలవడంతో సురక్షితంగా బయటపడ్డారు. మంత్రితో పాటు వచ్చిన నాయకులు, కార్యకర్తలపై దాడి చేయడంతో దాదాపు 70 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో బేతంచెర్ల ప్రజాశక్తి విలేఖరి వేణుగోపాల్‌ ఉన్నారు. గాయపడిన వారిని వైద్యం కోసం బేతంచెర్ల శేషారెడ్డి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం మంత్రి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, ఆరోగ్యపరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసున్నారు. గోరుమానుకొండ సర్పంచి కోడె వెంకటేశ్వర్లు, వాల్మీకి సంఘం నాయకులు రాముడు, మరో ముగ్గురు పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆటో నగర్‌ను ప్రారంభించిన మంత్రి బుగ్గన
అంతకుముందు బేతంచర్ల పట్టణ శివారులోని అయ్యల చెరువులో ఆటో నగర్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ లారీ, బస్సు మెకానిక్‌లు అద్దె భవనాలలో ఉంటూ, ట్రాఫిక్‌తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రని, వారి సమస్యలను పరిష్కరించాలన్న సదుద్దేశంతో 26 హెక్టార్లలో ఆటో నగర్‌ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మొదటి విడతగా 6.90 ఎకరాలలో ప్రారంభిస్తున్నామని, ప్రతి మెకానిక్‌కు 5 సెంట్ల స్థలంలో షెడ్డు ఏర్పాటు చేసుకొని, జీవనాన్ని కొనసాగించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ వెంకట రెడ్డి, నగర్‌ పంచాయతీ చైర్మన్‌ చలం రెడ్డి, తహశీల్దార్‌ నరేంద్ర నాథ్‌ రెడ్డి, బేతంచర్ల నగర పంచాయతీ కమిషనర్‌ రమేష్‌ బాబు, వైసిపి సీనియర్‌ నాయకులు బాబుల్‌ రెడ్డి, వైస్‌ ఖాజా, ముర్తుజావలి, నాగరాజు, దస్తగిరి, మద్దిలేటి స్వామి దేవస్థానం చైర్మన్‌ రామ చంద్రుడు, పిఏలు ప్రతాప్‌ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, డిఎస్‌పి శ్రీనివాస్‌ రెడ్డి, సిఐ ప్రియతమ్‌ రెడ్డి, ఎస్‌ఐ శివ శంకర్‌ నాయక్‌, అధికారులు, వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.