మంత్రి ఆర్కే రోజాకు ఘన స్వాగతం
- ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన మంత్రి
ప్రజాశక్తి - పగిడ్యాల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, యుజన శాఖ మంత్రి ఆర్కే రోజాకు పగిడ్యాల మండల కేంద్రంలో ప్రజలు, వైసిపి నాయకులు శనివారం ఘన స్వాగతం పలికారు. పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.1.19 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిలకు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. పగిడ్యాల మండల కేంద్రంలోకి మంత్రి రోజా, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డికి మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి, జడ్పిటిసి పుల్యాల దివ్య, ఎంపిపి మండ్ల మల్లేశ్వరి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. శివారు నుంచి గ్రామంలోకి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి రోజా దళిత కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, బస్టాండ్‌లో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఓపెన్ టాప్ కారుపై మంత్రి రోజా , శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రజలకు అభివాదం తెలుపుతూ వచ్చారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి రాగానే విద్యార్థులు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. అనంరం మంత్రి రోజా ఇండోర్ స్టేడియం శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. స్టేడియంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నివాసమైన ముచ్చుమర్రి గ్రామానికి వెళ్లారు. కార్యక్రమంలో సర్పంచి పెరుమాళ్ళ శేషన్న, మండల ఉపాధ్యక్షురాలు పల్లె అరుణమ్మ, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ్లెక్సీలో కనపించని ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ ఫొటో
మంత్రి రోజా నందికొట్కూరు, పగిడ్యాలలో రూ 2.38 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇండోర్ స్టేడియాలను ప్రారంభించేందుకు వచ్చిన నేపథ్యంలో నందికొట్కూర్, పగిడ్యాలలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఏ ఒక్క ఫ్లెక్సీలోనూ ఎమ్మెల్యే ఆర్థర్ ఫొటో లేకపోవడం నందికొట్కూరు పట్టణం, పగిడ్యాల మండలంలో చర్చనీయాంశంగా మారింది.










