Oct 14,2023 20:36

కురుపాం: పశువైద్య శాల

ప్రజాశక్తి - కురుపాం : మండలంలో పశువైద్యానికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ పశువైద్యశాలల్లో మందుల కొరత వైద్యానికి ప్రతిబంధకంగా మారింది. పశువుల పెంపకందారులపై ఆర్థికభారం పడుతోంది. ఆస్పత్రుల్లో పశువైద్యానికి అవసరమైన మందులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో వైద్యసేవలు అరకొరగా అందుతున్నాయి. రైతులు మందులను ప్రైవేటుగా కొనుగోలు చేసుకుంటేనే పశు వైద్యులు వైద్యం చేసే పరిస్థితులున్నాయి. దీంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పశువైద్యానికి అవసరమైన మందుల కొనుగోలుకు ప్రభుత్వం అరకొరగా బడ్జెట్‌ విడుదల చేయడంతో ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయనే విమర్శ వినిపిస్తోంది. దీంతో పశువుల ఆస్పత్రుల్లో మందులకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు నెలల నుండి రావాల్సిన మందులు ఇప్పటికీ రాలేదు. చాలా మందులు ప్రైవేట్‌ కొనుగోలు చేస్తున్నామని పాడిరైతులు తెలిపారు.
కురుపాం పశు వైద్య ఆసుపత్రికి అటెండరే దిక్కు
నియోజకవర్గ కేంద్రమైన కురుపాంలోని పశు వైద్య ఆసుపత్రికి రెగ్యులర్‌ వైద్యాధికారి లేక గరుగుబిల్లి మండలం నుంచి డిప్యూటేషన్‌ వేసిన ఆయన అప్పుడప్పుడు వస్తుండడంతో ఆస్పత్రిలో ఉన్న అటెండరే పశువులకు వైద్యం చేస్తున్నాడు. దీంతో పశువులకు సరైన వైద్యమందడంలేదని ఈ క్రమంలో ఆస్పత్రుల్లో క్షేత్రస్థాయిలో సక్రమంగా సేవలందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రెగ్యులర్‌ వైద్యాధికారి నియమించాలని మందులు అందుబాటులో ఉండేలా చూడాలని పశు పోషకులు కోరుతున్నారు.
మందులు, వైద్యాధికారుల కొరత లేకుండా ప్రభుత్వమే చూడాలి
ఓ పక్క వ్యవసాయనికి ఎరువులు, మందుల కోసం రైతులు వేల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ సరైన సమయంలో వర్షాల్లేక అనుకూలమైన వాతావరణం లేక పంట చేతికి వస్తాదో లేదో తెలియని పరిస్థితిలో అయోమయంలో ఉండగా, మరోవైపు పశువులు రోగాల బారిన పడుతుంటే ఆస్పత్రుల్లో పశువులు మందులు దొరక్క ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కొనుక్కోవడం వల్ల మరింత ఆర్థిక భారం రైతులపై పడుతుంది. కావున ప్రభుత్వమే స్పందించి ప్రతి పశు వైద్య ఆసుపత్రి వద్ద మందులు అన్ని అందుబాటులో ఉంచి రెగ్యులర్‌ వైద్యాధికారులను నియమించాలి.
కొల్లి గంగునాయడు
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు