Oct 22,2023 23:19
ఎండుతున్న వరి పైరు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వారం రోజులుగా జిల్లాలో వాతావరణం మండు వేసవిని తలపిస్తోంది. పలు ప్రాంతాల్లో 36 డిగ్రీలకు చేరువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయి. సాధారణంగా జిల్లాలో సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో వర్షా లు కురుస్తాయి. ప్రస్తుతం అందుకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్టోబరు రెండో వారంలోకి ప్రవేశించినా వేసవి మాదిరిగా ఉదయం ఎనిమిది గంటలు నుంచే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. సాయంత్రం ఐదు గంటల సమయంలోనూ వేడిగాలుల తీవ్రత కొనసాగు తోంది. ఇది జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధాన రహదారులన్నీ జన సంచారం లేక వెలవెలబోతు న్నాయి. ఓ వైపు వరుణుడు ముఖం చాటేయడం.. మరో వైపు ఎండల తీవ్రత పెరగడంతో పట్టణాలు, పల్లెలు అల్లాడుతున్నాయి. జిల్లాలో బుధవారం సరాసరి పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు నమోదయ్యాయి. రాత్రి వేళల్లోనూ సగటు 25 డిగ్రీలపైనే నమోదు కావడం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వేసవిని తలపించే రీతిలో ఎండలు ఉండటంతో రోజువారీ విద్యుత్తు వినియోగం కూడా బాగా పెరిగింది. ఫలితంగా సరఫరాలోనూ హెచ్చుతగ్గులు వచ్చి తరచూ కరెంట్‌ పోతోంది. ఇక వాతావరణ మార్పులతో ప్రజలకు అనారోగ్య సమస్యలు తీవ్రతరమవుతున్నాయి. జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
పశ్చిమ ప్రాంతంలోనూ..
గత రెండు నెలల నుంచి జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్టోబర్‌ నెల ప్రారంభం నుంచి భానుడు ప్రచండ నిప్పులు కురిపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రత లు గణనీయంగా పెరుగుతున్నాయి. కనిష్ట స్థాయిలో వుండాల్సిన ఉష్ణోగ్రతలు అక్టోబరు నెలలో సగటున రోజూ 35 నుంచి 37 డిగ్రీల సెల్సియస్‌ నమోదవు తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వాతావరణం వేడిగా ఉంటుంది. వాతావరణం అగ్నిగుండంగా మారడంతో ఎండల్లో తిరిగిన వారు జ్వరాల బారిన పడుతున్నారు. పాఠశాలలకు వెళ్తున్న పిల్లలలు కూడా తీవ్రమైన ఎండలకు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు, కర్షకులు, వివిధ రంగాల కార్మికులు అక్టోబర్‌ నెలలో మునుపెన్నడూ ఇటువంటి ఎండలు చూడలేదని అంటున్నారు. వర్షాలు ముఖం చాటేయడంతో కరువు తాండవిస్తోంది.
అన్నదాతల్లో ఆందోళన
ప్రస్తుత వాతావరణం వరిలో రసం పీల్చే పురుగుతోపాటు దోమ పెరుగుదలకు కారణమవుతోంది. ఇప్పటికే అక్కడక్కడా ఆరునల్లితో పాటు ఆకుముడత, మామిడి తెగులు కనిపిస్తోంది. దోమపోటు అధికమవుతుం డటంతో పంట ఏ మేర చేతికి అందుతుందోనని రైతులు భయపడుతున్నారు. ప్రస్తుత వాతావరణం వరి పంటకు ఏమాత్రం అనుకూలమైనది కాదని మార్టేరు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వాతావరణంలో దోమ, రసం పీల్చే పురుగు ఉధృతికి అవకాశంగా ఉంటుందని చెప్పారు.