Sep 06,2023 20:51

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి - పార్వతీపురం : ఇకపై మండలాల్లో బుధ, శుక్రవారాలు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ మేరకు బుధ, శుక్ర వారాల్లో మండల స్థాయిలో ఈ శుక్ర వారం నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. జిల్లా అధికారులంతా ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆయన అన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని ఆయన చెప్పారు.
8న సీతానగరంలో జగనన్నకు చెబుదాం
జిల్లా కలెక్టర్‌ స్థాయిలో మొట్ట మొదటి జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ఈనెల 8న శుక్ర వారం సీతానగరంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటల నుండి మండల పరిషత్‌ కార్యాలయంలో జరుగుతుందని ఆయన వివరించారు. సీతానగరం మండలం ప్రజలు తమ సమస్యలను తెలియజేయ వచ్చని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. గోవింద రావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌, డిఆర్‌ఒ జె.వెంకటరావు, ఆర్‌డిఒ కె.హేమలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి. వాగ్దేవి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ గౌరి, మున్సిపల్‌ కమిషనర్లు జె.రామ అప్పలనాయుడు, ఎస్‌.సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.