ప్రజాశక్తి - నందవరం
నందవరం మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని సిపిఎం జిల్లా నాయకులు గురుశేఖర్ డిమాండ్ చేశారు. బుధవారం గురుశేఖర్, సిపిఎం మండల నాయకులు రంగప్ప, దేవపుత్ర, ఎల్లేష్‌లు మాట్లాడారు. తుంగభద్ర నది పక్కనే ఉన్నా తాగు, సాగునీటికి ఇబ్బంది పడడం ఇంకెన్నాళ్లు అంటూ ప్రశ్నించారు. జిల్లా పర్యటనకు ఎన్నిసార్లు వచ్చినా అభివృద్ధికి నిధులు కేటాయించడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 'జగనన్న చేదోడు' ఆర్థిక సహాయం నాలుగో విడత విడుదల చేసేందుకు ఎమ్మిగనూరు పట్టణానికి వస్తున్నారని తెలిపారు. వెనుకబడిన నందవరం మండలం సమస్యలపై బహిరంగ సభలో మాట్లాడాలని, నందవరం మండలాభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఎక్కువ గ్రామాలు తుంగభద్ర నది పక్కనే ఉన్నా స్వచ్ఛమైన తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తుంగభద్ర నది దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేయడంతో పాటు నీటిని శుభ్రం చేసి ప్రజలకు ఇవ్వాలన్నారు. హాలహర్వి గ్రామంలో సీలింగ్ భూమి సమస్యను పరిష్కరించాలని, ఏ గ్రామం నుంచి ఏ గ్రామానికి వెళ్లాలన్నా రహదారులు గుంతలమయమయ్యాయని తెలిపారు. శ్మశాన వాటికలు లేని గ్రామాల్లో స్థలాలు కేటాయించాలని కోరారు. పొనకలదిన్నె నుండి కనకవీడు మీదుగా నందవరం రోడ్డు వేసి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని తెలిపారు. పాఠశాలల్లో ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, కస్తూరిబా, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సీట్ల సంఖ్యను పెంచాలని కోరారు. 2022లో నష్టపోయిన రైతులకు బీమా సౌకర్యం పెంచి ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నందవరంలో రైతు బజారును ఏర్పాటు చేయాలని కోరారు. నాగలదిన్నె, చిన్నకొత్తిలి నుంచి పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సిపిఎం నాయకులు స్వామి దాసు, బి.కరుణాకర్, కనకవీడు రాజు, నాగప్ప, పెద్దయ్య, అశోక్, రాము, కొండయ్య, నాగేష్, సంతోష్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న సిపిఎం జిల్లా నాయకులు గురు శేఖర్










