ప్రజాశక్తి కొమరాడ : మండలంలోని ఏమైనా సమస్యలైనా, అభివృద్ధి అయినా చెప్పుకొనేందుకు మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం ప్రతిసారి లాగానే ఈసారి కూడా మామ అని అనిపించారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి శెట్టి శ్యామల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అధికారులు కూడా పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడం విశేషం. సమావేశానికి సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో హాజరు కాకపోయినప్పటికీ కొన్ని శాఖల అధికారులు దిగువ సిబ్బందిని పంపించి తూతుమత్రంగా సమాచారాన్ని ఇచ్చి పంపంపించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సర్వసభ్య సమావేశానికి అధికారులు ఎందుకు పూర్తి స్థాయిలో హాజరు కాలేదని ప్రశ్న సభ్యుల్లో వినిపించింది. దీంతో స్పందించిన ఎంపిడిఒ మల్లికార్జునరావు సమావేశానికి గైర్హాజరైన అధికారులకు ఫోన్లు చేసి సమావేశానికి రావాలని పిలవడం చర్చనీయాంశమైంది. ఎప్పటిలాగానే వివిధ శాఖల వారీగా అధికారులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరాలను టపా టపామని చదివి వినిపించి నివేదికలు తెలియజేశారు. ప్రతి సమావేశంలోనూ ప్రశ్నించే విక్రంపురం, గంగరేగువలస ఎంపిటిసి సభ్యులు దేవకోటి వెంకట నాయుడు, గంట వెంకట నాయుడు, తొడుము సర్పంచ్ జి.సింహాచలం తమ పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలను అధికారులకు వెళ్ళబుచ్చుకున్నారు. ప్రతి సమావేశంలో చెప్పిన సమస్యలను గుర్తు చేయడమే తప్ప కనీసం పరిష్కారానికి చర్యలు చేపట్టకపోవడం చాలా దారుణమని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో దీర్ఘకాల సమస్యగా ఉన్న పూర్ణపాడు-లాబేసు వంతెనపై ఎటువంటి చర్యలు చేపట్టారని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి సమావేశానికి వద్ద వచ్చి నిరసన తెలిపి మాట్లాడారు. ఒకవైపు ఏనుగులు సమస్య మండల ప్రజలను వేధిస్తున్నా కనీసం ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. మండలంలో గతంలో ఉండే బస్సు సర్వీసులను అధికారులు పూర్తిగా నిలుపుదల చేయడంతో మండల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వినతి అందజేసి సమస్యలను గుర్తు చేశారు. అనంతరం సభ్యులకు కూడా ఏనుగుల సమస్యలను పార్టీలకు అతీతంగా తీర్మానం చేసి పరిష్కారయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. సమావేశానికి వచ్చిన అధికారులు పూర్తిస్థాయిలో సంబంధిత ఉన్నతాధికారుల హాజరు కాకపోవడంతో ప్రతి సమావేశంలో చెప్పిన వారు నిర్దేశానికి చర్యలు తీసుకోవాలని సభ్యులు డిమాండ్ చేశారు. సమావేశంలో జెడ్‌పిటిసి సభ్యులు ద్వారపురెడ్డి లక్ష్మి, వైస్ ఎంపిపి అన్నపూర్ణ, పలువురు ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.










