ప్రజల వద్దకే వైద్యసేవలంటూ ఒకవైపు ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తుండగా, మరోవైపున గిరిజన గ్రామాల్లో ప్రజలు జ్వరాలతో మూలుగుతున్నారు. దీంతో ప్రభుత్వం చేస్తున్న అట్టహాస ప్రచారానికి గిరిజన గ్రామాల్లోని పరిస్థితికి పొంతన ఉండడంలేదు. ఇందుకు నిదర్శనం మండలంలోని మడవలస గిరిజన గ్రామమంతా మంచాన పడింది
ప్రజాశక్తి - మక్కువ : మండలంలోని దెబ్బగడ్డ పంచాయతీ మడవలస గిరిజనులు వారం రోజులుగా జ్వరాలతో బాధపడుతున్నారు. ఈ వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చిన కనీసం పట్టించుకోవడం లేదని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. సుమారు 18 కుటుంబాల్లో 70 మంది వరకు ప్రజలు నివసిస్తున్నారు. జ్వరం, జలుబు, నీరసం, శరీరం నొప్పితో వీరంతా బాధపడుతున్నారు. కాస్త స్తోమత కలిగిన వారు పట్టణ ప్రాంతాలకు వైద్యం కోసం తరలిపోగా, ఆర్థికస్తోమత లేనివారంతా ఇళ్ల వద్ద మంచాల మీదే మూలుగుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో మెలిక నర్సింగరావు, రోహిత్, కార్తీక్, అన్నమ్మ, తీటమ్మ, రవి, శ్రీరాము, మోసే, ఝాన్సీ, సున్న తదితరులు జ్వరంతో బాధపడుతున్నారు. అలాగే సోడిపల్లి బిట్టు, సింగారమ్మ, బూతమ్మలు వైద్యం కోసం పట్టణాలకు వెళ్లిపోయారు. శంబర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దూరం కావడంతో ఇబ్బందులు తప్పడం లేదని గిరిజనులు వాపోతున్నారు. 104 వాహనం వచ్చి సమాచారం ఇచ్చినా మందులు లేవంటూ సమాధానం ఇచ్చారని గ్రామ పెద్ద మిల్లికి రవి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలుమార్లు స్థానిక సిబ్బందికి సమాచారం ఇచ్చినా కనీసం పట్టించుకోలేదని సూడిపల్లి బిట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు. అయితే ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం వైద్యశిబిరం నిర్వహించి గ్రామస్తులకు వైద్య సేవలందించారు.
సురక్ష సర్వేలో బిజీగా ఉన్నందున...
ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేలో వైద్య సిబ్బంది అంతా బిజీగా ఉన్నారని, అందువల్లే గ్రామానికి చేరుకోలేకపోయారని శంబర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రఘు కుమార్ ప్రజాశక్తికి తెలిపారు. గ్రామంలోకి వైద్య సిబ్బందిని పంపి పరీక్షలు నిర్వహించి, మందులు అందజేస్తామని ఆయన అన్నారు.
సకాలంలో వైద్యమందక వ్యక్తి మృతి
ప్రజాశక్తి - గరుగుబిల్లి
గరుగుబిల్లి పంచాయతీ హిక్కింవలస గ్రామానికి చెందిన వ్యక్తికి సకాలంలో వైద్య సేవలందక పోవడంతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. హిక్కింవలసకు చెందిన జాగాన బలరాము నాయుడు మంగళవారం ఉదయం వరి పంటకు యూరియాను వేసేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో స్పహతప్పి పడిపోవడంతో కుటుంబీకులు, గ్రామస్తులు హుటాహుటిన ఆటోతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఆ సమయంలో పిహెచ్‌సికి చెందిన ఇద్దరు వైద్యులు గొట్టివలసలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంకు హాజరయ్యారు. ఆ సమయంలో పిహెచ్‌సిలో విధులు నిర్వహిస్తున్న ఎఎన్‌ఎం వైద్యం చేసేందుకు నిరాకరించి పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అయితే పరిస్థితి విషమించడంతో ప్రథమ చికిత్స చేయాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైద్య సేవలందించాలని తెలిపారు. ఆక్సిజన్ పెట్టాలని కోరినప్పటికీ ఆక్సిజన్ పెట్టలేదని అలా అయితే బతికే వారేమోనని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో కనీసం ఒక వైద్యాధికారైనాలేకపోవడం వల్ల నిండుప్రాణం బలైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.










