మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో ఉద్యమించాలి
వర్థంతి సభలో సిపిఎం నేతల ఉద్ఘాటన
ప్రజాశక్తి - మొవ్వ
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కీర్తిశేషురాలు మల్లు స్వరాజ్యం పోరాట స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఎం కృష్ణాజిల్లా కార్యదర్శి వై.నరసింహారావు, కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.రఘులు పిలుపునిచ్చారు. ఆదివారం మొవ్వ మండలం చినముత్తేవిలో మల్లు స్వరాజ్యం ప్రథమ వర్థంతి సభ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు వి.జ్యోతి అధ్యక్షతన జరిగిన సభలో వై.నరసింహారావు, ఆర్.రఘులు మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలిగా, సిపిఎంలో కీలక నాయకురాలిగా ఆమె క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. మల్లు స్వరాజ్యం పోరాట పటిమ అనుసరణీయమని కొనియాడారు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా వేలాదిమంది ప్రజలతో మల్లు స్వరాజ్యం అవిశ్రాంత పోరాటం చేశారని గుర్తుచేశారు. అనేకసార్లు నిర్బంధం, జైలు జీవితం, రహస్య జీవనం గడిపిన స్వరాజ్యం ఎప్పటికప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ప్రజలను కూడగట్టి పోరాటాలను కొనసాగించారని వివరించారు. తొలుత మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్ళం వెంకటేశ్వరరావు, కె.శివనాగేంద్రం, నాయకులు ఆర్ సిపి రెడ్డి, శీలం నారాయణరావు, వాకా రామచంద్రరావు, ఎండి కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.










