Aug 24,2023 21:34

సభలో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్‌ : రాష్ట్రంలో మళ్లీ వైసిపి ప్రభుత్వమే కొలువు తీరుతుందని, జగన్మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రి అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు రాష్ట్రంలోనే మొదటి సారిగా పూర్తి చేసిన సందర్భంగా గురువారం స్థానిక పాత బస్టాండ్‌ కూడలి వద్ద ఏర్పాటు చేసిన విజయోత్సవ భారీ బహిరంగ సభకు బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చడమే కాక, సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించారన్నారు. కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్‌ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌తో పాటు పలువురు టిడిపి నాయకులు ముఖ్యమంత్రిని, మంత్రులను దుర్భాషలాడుతూ విమర్శిస్తున్నారని, ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేలంతా రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కష్టపడి పనిచేయాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు నియోజక వర్గాన్ని ఎంతో అభివద్ధి పథంలో నడిపించేందుకు పనిచేస్తూ కష్టపడుతున్నారని, కులం, మతం,ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేస్తూన్నారని. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసిపి జెండాను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, నియోజకవర్గ పరిశీలకులు శోభ హైమావతి, జిల్లా వ్యవసాయ సంఘం చైర్మన్‌ వాకాడ నాగేశ్వరరావు, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ మామిడి శ్రీకాంత్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ లు, బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం ఎంపీపీలు, జడ్పిటిసిలు, మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.