ప్రజాశక్తి-రొద్దం : రాజకీయ కక్షలతో మండల పరిధిలోని కంబాలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బీదనపల్లి మంజుకు చెందిన మల్బరీ తోటపై విష ప్రయోగం చేయడం దుర్మార్గమైన చర్య అని సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షుడు బికె పార్థసారధి, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి సవిత పేర్కొన్నారు. విష ప్రయోగం చేసిన తోటను శనివారం వారు పరిశీలించారు. అనంతరం బికె మాట్లాడుతూ కంబాలపల్లి సర్పంచ్ మంజు తండ్రి రామాంజనేయులు ఐదెకరాల్లో మల్బరీ వంట సాగు చేశాడు. పంట కోతకు వచ్చే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేయడంతో రైతు రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు నష్టపోయాడని తెలిపారు. రాజకీయ కక్షలు ఉంటే ముఖాముఖి తేల్చుకోవాలి తప్పా ఇలా రైతుల పొట్టకొట్టడం విష సంస్కతి అంటూ హెచ్చరించారు. దీనికి తోడు రెండు నెలల క్రితం ఇదే రైతు సిరికల్చర్ షెడ్డు నిర్మించేటప్పుడు రాజకీయ కక్షలతో గ్రామస్థాయి నాయకుల ఒత్తిడి మేరకు పెనుగొండ ఎమ్మెల్యే శంకర నారాయణ నిలిపివేయించారని మండిపడ్డారు. దానిపై బాధితుడు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొన్నారని వివరించారు. ఇది రొద్దం మండలంలో రెండవదని, నా 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో తొలుత కుర్లపల్లిలో మారుతి రెడ్డి అనే రైతుకు జరిగిందని, ఇది రెండవది అని మండిపడ్డారు. ఎమ్మెల్యే శంకర నారాయణ గ్రామానికి వెళ్లి పొలాన్ని పరిశీలించి నిందితులను శిక్షించేలా ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆగంతకులకు బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. సవిత కూడా పంటను పరిశీలించి రైతు మంజును పరామర్శించారు. పోలీసులు కూడా పంటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి జీవీపీ నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు, మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు చిన్నప్పయ్య, కన్వీనర్ నరహరి, ప్రధాన కార్యదర్శి మురళి, సర్పంచ్ మంజు, మాధవనాయుడు, టైలర్ ఆంజనేయులు, వీరాంజి, త్రివేంద్రం నాయుడు, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










