Sep 06,2023 20:54

సమావేశంలో మాట్లాడుతున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ జెఎసి నాయకులు

ప్రజాశక్తి - బెలగాం : సమగ్ర శిక్ష అభియాన్‌, కెజిబివిల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌, పార్ట్‌ టైం ఉద్యోగులకు మినిమం టైం స్కేల్‌ అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 10న కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ''వేడుకోలు''దీక్ష నిర్వహించనున్నట్టు జెఎసి నాయకులు బివి రమణ, బి.ఈశ్వరరావు, కె.నరసింహాచారి తెలిపారు. బుధవారం పార్వతీపురం సుందరయ్య భవనంలో సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమావేశంలో వారు మాట్లాడారు. సర్వశిక్షాభియాన్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని గత ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కెజిబివి ఉద్యోగులకు, సిఆర్‌పిలకు, పార్ట్‌ టైం ఇన్స్ట్రక్ట్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 15 శాతం జీతాలు పెంచినప్పటికీ సర్వ శిక్షా అభియాన్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచకపోవడం సమంజసం కాదని అన్నారు. సుప్రీంకోర్టు సూచన ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సర్వశిక్ష ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగంలో విశిష్ట ప్రతిభ కనబరుస్తున్న ఈ విభాగంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరైన విధానం కాదని అన్నారు. నిర్దిష్ట కాలం ప్రాతిపదికన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, మెడికల్‌ లీవులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రెగ్యులర్‌ చేసే వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్ని సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులకు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లతో ఇప్పటికే అనేక దశల్లో ఆందోళన చేపట్టామని, అయినా ప్రభుత్వంలో స్పందన లేని నేపథ్యంలోనే ప్రభుత్వానికి ఉద్యోగుల గోడు తెలియజేయడానికి రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఈనెల 10న కలెక్టర్‌ కార్యాలయం వద్ద 'వేడుకోలు'' దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ దీక్షలో సర్వశిక్ష అభియాన్‌లోని అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.