ధాన్యం కొనుగోలు సమస్యలను ముందే పరిష్కరించాలంటున్న రైతులు
తేమ, తూకం పేరుతో మిల్లర్ల దోపిడీని అరికట్టాలని ఆవేదన
మిల్లుల్లో అన్‌లోడింగ్ ఆలస్యంతో రైతులపై అదనపు ఛార్జీల భారం
లారీలు, సంచుల ఏర్పాటుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి
గత రబీలో ఎదురైన సమస్యలపై దృష్టి సారించాలంటున్న అన్నదాత
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ప్రతియేటా ధాన్యం కొనుగోలుపై పాలకులు, అధికారులు చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితికి ఏ మాత్రం సంబంధం ఉండటం లేదు. ధాన్యం కొనుగోలుపై ముందస్తు సమావేశాల పేరుతో హడావుడి చేయడం తప్ప సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల సమస్యలే ప్రధానమని రైతులు గగ్గోలు పెడుతున్నారు. వీటికితోడు లారీలు లేక రవాణా ఇబ్బందులు, సంచుల కొరత వరి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. గడిచిన రబీలో ధాన్యం కొనుగోలులో రైతులు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ ఖరీఫ్ సీజన్‌లోనైనా సమస్యలు లేకుండా ధాన్యం కొనుగోలుపై ముందుగానే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు అక్టోబర్ నెలాఖరు నుంచి ప్రారంభించనున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముందస్తు సమావేశాలు సైతం నిర్వహిస్తున్నారు. అయితే రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై మాత్రం స్పష్టత ఇవ్వని పరిస్థితి ఉంది. అంతకుముందుగాని, గడిచిన రబీలోగాని ధాన్యం కొనుగోలులో రైతులు పడిన ఇబ్బందులు వర్ణనాతీతమని చెప్పొచ్చు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి మిల్లర్లే ప్రధాన సమస్యగా మారారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రస్తుత ఖరీఫ్‌లో దాదాపు 4.50 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేపట్టారు. వాతావరణం అనుకూలిస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని రైతులు అంచనా వేస్తున్నారు. అయితే ధాన్యం కొనుగోలుకు సంబంధించి మాత్రం ఇప్పటి నుంచే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రైతుభరోసా కేంద్రాల్లో తేమశాతం, వేబ్రిడ్జి తూకం పరిశీలన జరిగిన తర్వాత అధికారుల ఆధ్వర్యంలోనే రైతులు మిల్లులకు ధాన్యం తరలిస్తున్నారు. తీరా ధాన్యం మిల్లులకు చేరిన తర్వాత అక్కడ మిల్లర్లు పెడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. తేమశాతం ఎక్కువగా ఉందంటూ ధాన్యం దిగుమతి చేయకుండా నిలుపుదల చేస్తున్నారు. తేమశాతాన్ని బట్టి రైతుల నుంచి సొమ్ము వసూలు చేస్తున్నారు. వేబ్రిడ్జి కాటా వేసిన తర్వాత కూడా తూకంలో తేడా ఉందంటూ మళ్లీ సొమ్ము వసూళ్లు జరుగుతున్నాయి. రైతుల నుంచి వసూలు చేస్తున్న సొమ్మును ఫోన్‌పే ద్వారా తీసుకుంటున్నారు. సొమ్ము చెల్లించకపోతే ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదు. ఇదంతా బహిరంగంగానే జరుగుతోంది. అయినప్పటికీ రైతులకు న్యాయం జరగని పరిస్థితి ఉంది. రబీ సీజన్‌లో చాలామంది రైతులు రూ.15 వేల నుంచి రూ.22 వేల వరకూ మిల్లర్లకు చెల్లించిన పరిస్థితి ఉంది. రైతుభరోసా కేంద్రంలో తేమ, తూకం పరిశీలించి అంతా బాగుందని పంపిన తర్వాత మిల్లర్లు సొమ్ము వసూలు చేయడంపై ప్రభుత్వం కచ్ఛితమైన చర్యలు తీసుకోవడం లేదు. రైతుల నుంచి సొమ్ము వసూలు చేస్తే మిల్లులు సీజ్ చేస్తామని ప్రకటనలు గుప్పించడంతోనే సరిపోతుంది. సొమ్ము వసూలు చేసిన మిల్లర్ల నుంచి తిరిగి రైతులకు సొమ్ములు ఇప్పించడం వంటి చర్యలు ఎక్కడా జరగలేదు. తేమ, తూకం విషయంలో ఎందుకు తేడాలు చూపిస్తున్నారో స్పష్టమైన ఆధారాలు సైతం చెప్పడం లేదు. తేమ, తూకం విషయంలో రైతుభరోసా కేంద్రాల అధికారుల నిర్ణయమే అంతిమంగా ప్రభుత్వం ప్రకటించాలి. ఒక్కసారి రైతుభరోసా కేంద్ర అధికారులు అన్నీ సవ్యంగా ఉన్నాయని పంపించిన తర్వాత కూడా మిల్లర్లు సొమ్ము వసూలు చేస్తే ఎటువంటి చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని రైతులు కోరుతున్నారు. మిల్లర్లకు తేమ, తూకం నిమిత్తం ఎటువంటి సొమ్మూ చెల్లించనక్కర్లేదని అధికారులు రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది. మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోకుండా ఆలస్యం చేయడంతో అధికంగా రవాణా ఛార్జీల భారం రైతులపై పడుతోంది. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
లారీలు, సంచుల సమస్య తీరేనా
ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బంది పెడుతున్న మరో సమస్య రవాణాకు సంబంధించి లారీలు, సంచుల సమస్యలు. ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఈ సమస్య అత్యధికంగా ఉంటుంది. మాసూళ్లయిన తర్వాత లారీలు ఏర్పాటు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. దీంతో రైతులే పెద్దమొత్తంలో కిరాయిలు చెల్లించి లారీలు పెట్టుకోవాల్సిన దుస్థితి ఉంటుంది. లారీలు లేక మాసూలు చేశాక 15 రోజులకుపైగా ధాన్యం కళ్లాల్లోనే ఉండిపోతున్న పరిస్థితీ ఉంది. సంచులు సరిపడా ఇవ్వకపోవడం, చిరిగిన సంచులు ఇవ్వడం వంటి సమస్యలతో రైతులు నలిగిపోతున్నారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. లేకపోతే అధికారులు ఎన్ని సమావేశాలు పెట్టినా రైతులకు ఎటువంటి ప్రయోజనమూ ఉండదని చెప్పొచ్చు.










