Oct 17,2021 17:40

స్మార్ట్‌ఫోన్‌ మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. అది లేకపోతే జీవన ప్రయాణం ఆగిపోతుంది కొందరికి. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ క్లాసుల నుంచి ఆఫీస్‌ సమావేశాల వరకూ ఎన్నో విధాలుగా స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నాం. ఇదే అదునుగా చేసుకొన్న సైబర్ నేరగాళ్లు  ఫోన్‌లోని యూజర్‌ డేటా లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్నారు. ఈ సంఖ్య బాగా పెరిగిందని సైబర్ సెక్యూరిటీ సంస్థలు చెబుతున్నాయి. యాప్‌లు, మెసేజ్‌లు, ఈ-మెయిల్‌ వంటి వాటి ద్వారా యూజర్‌ మొబైల్స్‌లోకి వైరస్‌ నుంచి పంపి వారి విలువైన సమాచారాన్ని దొంగిలిస్తున్నారని నిపుణులు తెలుపుతున్నారు.  
వైరస్‌ ఉందని ఎలా తెలుస్తుంది..
మనం రెగ్యులర్ గా వాడుతున్న స్మార్ట్ ఫోన్ అనుకోకుండా స్లో అవుతుంది. కారణం తెలియక.. ఫైల్స్‌, యాప్‌లు డిలీట్‌ చేయడంతోపాటు, ఫోన్ రీస్టార్ట్ చేయడం వంటివి చేస్తుంటాం. కానీ ఫోన్‌ పనితీరులో మాత్రం ఎలాంటి మార్పూ రాదు. తరచుగా ఈ పరిస్థితి మీకు ఎదురవుతుంటే మాత్రం మీ ఫోన్‌ వైరస్‌ బారిన పడినట్లు అనుమానించాల్సిందేనని అంటున్నారు సైబర్‌ నిపుణులు.


 స్మార్ట్‌ఫోన్‌లో వైరస్‌ను గుర్తించేందుకు కొన్ని సూచనలు చేశారు. అవేంటో చూద్దాం.
1. ఛార్జింగ్ సమస్య
ఉన్నట్లుండి మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ తగ్గిపోతుంటే.. దానికి కారణం వైరస్‌ కావచ్చు. ఎందుకంటే హ్యాకర్స్‌ మన ఫోన్‌లోకి యాప్‌లు, మెసేజ్‌లు, ఈ-మెయిల్‌ ద్వారా వైరస్‌ను పంపుతారు. తర్వాత మనకు తెలియకుండానే  ఫోన్‌ లోని ఉన్న యాప్‌ల సాయంతో కొనుగోళ్లు చేస్తూ.. మన ఫోన్ నుంచి ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు పంపడమో చేస్తుంటారు. దీంతో ఫోన్ ఛార్జింగ్ తగ్గిపోతుంది. ఇలాంటి సమస్య మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంటే మాత్రం వైరస్‌ ఉన్నట్లు అనుమానించాల్సిందే.
2. యాప్‌లతో జర భద్రం
మనకు అవసరమైన ఏవేవో యాప్‌లను  ప్లేస్టోర్ నుంచి  డౌన్‌లోడ్ చేస్తాం. వాటిలో కొన్ని నకిలీవి కూడా ఉంటాయి. మనం వాటిని డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే సైబర్ నేరగాళ్లు ఫోన్లలోకి వైరస్‌ను పంపి బ్యాంకింగ్‌ లాగిన్ వివరాలతోపాటు ఇతరత్రా ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. దీంతో మన బ్యాంక్ ఎకౌంటు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.
యాప్‌లు డౌన్‌లోడ్ చేసేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి...
 ప్లేస్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ నుంచి యాప్‌లు డౌన్‌లోడ్ చేసేప్పుడు అవి వెరిఫైడ్ సోర్స్‌ నుంచి వచ్చినవో కాదో చెక్ చేసుకోవాలి. మనం ఏ యాప్ ను డౌన్‌లోడ్ చేయాలనీ అనుకుంటామో దాని అక్షరాలు(స్పెల్లింగ్), లోగోలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఏ మాత్రం అటుఇటుగా ఉన్న వాటి జోలికి పోకపోవడం మంచిదని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. అలానే రివ్యూలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సదరు యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.


వైరస్‌ కు రీసెట్ ఓ మందు...
స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ యాడ్స్‌ తరచుగా కనిపిస్తుంటే కూడా వైరస్‌ ఉన్నట్లేనంటున్నారు. అలానే మీ అనుమతి లేకుండా కొత్త యాప్‌లు డౌన్‌లోడ్ అవుతున్నా.. ఫోన్‌ పనితీరు నెమ్మదించినా ఫోన్ వైరస్‌ బారినపడినట్లే. ఒకవేళ వీటిలో ఏదైనా సమస్య మీ ఫోన్‌లో ఉంటే వెంటనే ఫోన్‌లో అవసరంలేని యాప్స్‌ని తొలగించి.. ఫోన్‌ ఫ్యాక్టరీ రీసెట్‌ చేయమని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు