
మహిళలపైన హింసను ఆపాలి
- మణిపూర్ ఘటనపై ప్రధాని, హోంమంత్రి రాజీనామా చేయాలి
- పోరు యాత్రలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
దేశంలో మహిళలపై జరుగుతున్న హింసను తక్షణమే ఆపాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించిన నిందుతులపై చర్యలు తీసుకోలేని కేంద్ర ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని దేశ ప్రజలందరూ భావిస్తున్నారని అన్నారు. హింసపై మహిళల పోరు యాత్ర పేరుతో జులై 28 నుండి ఆగస్టు 8 వరకు ఐద్వా ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర యాత్ర శనివారం నంద్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా గాంధీ చౌక్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. మహిళలపై రోజురోజుకు అనేక రూపాల్లో హింస పెరిగిపోతుందని తెలిపారు. మణిపూర్ ఘటనలో నిందితులను శిక్షించడంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. నేరం రుజువు కాకుండా జడ్జిని చంపిన వ్యక్తి కేంద్ర హోమంత్రిగా ఉండటం దురదృష్టకరమన్నారు. అత్రాస్, కత్వ, గుజరాత్, ఉద్ధవ్ వంటి ప్రాంతాల్లో మహిళలపై అఘాయిత్యాలు చేసిన నిందితులకు రక్షణ ఇస్తున్న బిజెపి ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. ఇది కేవలం ప్రజా చైతన్యంతోనే సాధ్యమౌతుందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో కూడా వైసిపి ప్రభుత్వం బిజెపి అడుగు జాడల్లో నడుస్తుందన్నారు. దేశంలో బతకాలంటే ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలను ప్రజా చైతన్యంతో పారద్రోలాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర కోశాధికారి సావిత్రి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలన్నారు. జిల్లా అధ్యక్షురాలు టి.నిర్మల మాట్లాడుతూ హింస లేని సమాజ నిర్మిద్దాం పేరుతో మహిళా సంఘం ఆధ్వర్యంలో బస్సు యాత్ర ప్రారంభం అయిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల మహిళల్లో చైతన్యం నింపుతూ హిందూపూరం నుండి బయలుదేరిన జాతా నంద్యాలకు చేరుకుందన్నారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే మహిళా క్రీడాకారులపై బిజెపి ఎంపీ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పినా సస్పెండ్ చేయకపోవడం శోచనీయమన్నారు. అంతకు ముందు మహిళా కళాకారులూ చేపట్టిన సాంస్కృతిక చైతన్య కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఐద్వా సీనియర్ నాయకురాలు సత్యనారాయణమ్మ, నాయకురాలు కృష్ణవేణి, డోన్ నాయకురాలు షమీమ్ బేగం తదితరులు పాల్గొన్నారు. మహానంది : మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని నాలుగు రోడ్ల కూడలిలో హింసపై మహిళల పోరుయాత్రలో భాగంగా రాష్ట్రజాతా మహిళా కళాకారులతో ఆటపాటలతో చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, రాష్ట్ర ట్రెజరర్ సావిత్రమ్మ మాట్లాడారు. గ్రామీణ స్థాయి నుంచి మహిళల్లో చైతన్యం కలిగించేందుకు కళారూపాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 8న విజయవాడలోని జింఖానా గ్రౌండ్లో జరిగే భారీ బహిరంగ సభలో జిల్లాలోని మహిళలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.రామ చంద్రుడు, వ్యకాసం మండల నాయకులు కోటకొండ భాష, అమృత, కృష్ణవేణి, సరస్వతి, ఫాతిమా, మద్దిలేటి, నాగార్జున, సౌరవ్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.










