Aug 05,2023 23:14


ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి, ఉపాధ్యక్షులు పూర్ణ
కృష్ణాజిల్లాలోకి ప్రవేశించిన 'హంసపై మహిళల పోరు యాత్ర'
ప్రజాశక్తి - కృష్ణా ప్రతినిధి, గుడివాడ, గన్నవరం :
దేశంలో మహిళలపై జరుగతున్న హింసను అరికట్టడంతో పాలకులు విఫలమవుతున్నారని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి ఆందోళన వ్యక్తం చేశారు. అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన జూలై 28న విశాఖ జిల్లా నుండి ప్రారంభమైన 'హంసపై మహిళల పోరు యాత్ర' శనివారం కృష్ణాజిల్లాలోకి ప్రవేశించింది. అనంతరం హనుమాన్‌ జంక్షన్‌, ఆరుగొలను, గుడివాడ మీదుగా రాత్రికి మచిలీపట్నం చేరుకుంది. ఆయా ప్రాంతాల్లో యాత్రకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా బాపులపాడు ఎంజి నగర్‌ వద్ద, గుడివాడ వికెఆర్‌ విఎన్‌బి కళాశాల ఆవరణలో, మచిలీపట్నం రామానాయుడుపేట సాంఘీక సంక్షేమశాఖ విద్యార్థునుల వసతి గృహం వద్ద సభలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఐద్వా జిల్లా అధ్యక్షులు వి.జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సభల్లో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.పూర్ణ మాట్లాడుతూ మతోన్మాద బిజెపి ప్రభుత్వ విధానాలే మణిపూర్‌లో హింసకు కారణమన్నారు. ఈ దారుణమారణ కాండ బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నెట్‌ సేవలను సైతం నిలిపివేశారని పేర్కొన్నారు. అక్కడ మహిళలపై జరుగుతున్న అకృత్యాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నా ప్రధాని మోడీ నోరుమెదపకపోవడం దారుణమన్నారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. మణిపూర్‌ ఘటనలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. అక్కడ శాంతిభద్రతల పరిరక్షణకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు యువతపై మత్తుపదార్థాలు, ఇతర చెడు ప్రభావాలు పడుతున్నాయని, దీంతో మహిళలకు భద్రత కరువైందని అన్నారు. మహిళలు అదశ్యమవుతున్నారని పేర్కొన్నారు. లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. వీటిని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. మద్యం, మత్తు పదార్ధాల నియంత్రణ, నివారణకు కమిషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. వీటికి బానిసలైన యువతకు డి ఎడక్షన్‌ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. వారంలో ఒకరోజు పూర్తిగా మద్యం విక్రయాలను నిలిపివేసి డ్రై డేను పాటించాలన్నారు. మహిళలపై హింసను అరికట్టేందుకు అవసరమైన చట్టాలను తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మహిళల సమస్యల పరిష్కారానికి ఈనెల 8న విజయవాడ జింఖానా గ్రౌండ్లో జరిగే యాత్ర ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈయాత్ర బృందంలో ఐద్వా సహాయ కార్యదర్శులు వై.సత్యవతి, సిహెచ్‌.రమణి, కళాకారులు వెంకటలక్ష్మి, విజయలక్ష్మి, విజయ, సుజాత, దుర్గ ఉన్నారు. గుడివాడ, హనుమాన్‌జంక్షన్‌, మచిలీపట్నంలలో జరిగిన కార్యక్రమాల్లో ఐద్వా కష్ణాజిల్లా కార్యదర్శి వీరమాచినేని జ్యోతి, ఐద్వా గుడివాడ పట్టణ అధ్యక్షురాలు కుమారి, కోశాధికారి వీరమ్మ, వికెఆర్‌ విఎన్‌బి కళాశాల సెక్రటరీ అండ్‌ కరెస్పాండెంట్‌ వి.కోదండరామయ్య, కళాశాల డైరెక్టర్‌ బి.కళ్యాణ్‌ కుమార్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌హెచ్‌వి.ప్రసాదరావు, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డి.దిలీప్‌, బాపులపాడు మండల నాయకులు నల్లి అనిత, బేతా అరుణ, స్థానిక మహిళలు షేక్‌ గౌస్య, మద్దాల దుర్గా, షేక్‌ మాలిన్‌, సుంకర సత్యవతి, రైతు సంఘం మండల కార్యదర్శి తోట సాంబశివరావు, నాయకులు మధు, ఐద్వా మచిలీపట్నం నగర అధ్యక్ష కార్యదర్శులు విజయలక్ష్మి, సుజాత, నాయకులు బి.భవానీ, పద్మ, లక్షి తదితరులు పాల్గొన్నారు.