ప్రజాశక్తి - ఆదోని
వ్యాపారాలు నిర్వహించుకునేందుకు పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాలను బ్యాంకుల ద్వారా అందించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వై.సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆదోనిలోని టూ టౌన్ పోలీసు స్టేషన్ సమీపంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ షమీనా, మెప్మా ఆఫీసర్ వీరారెడ్డి అధ్యక్షతన అర్బన్ మెప్మా మార్కెట్‌ను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ శాంత, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆదోని అర్బన్‌లో సుమారు 3 వేల పొదుపు గ్రూపులు ఉన్నాయని తెలిపారు. ప్రతేడాది బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను రూ.20 కోట్లు మంజూరయ్యేలా లక్ష్యం పెట్టుకున్నారని చెప్పారు. ప్రతి పొదుపు మహిళకూ రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాటలు వేస్తున్నారని తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ రాయితీ కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఇళ్ల వద్ద వ్యాపారాలు చేసుకునే వారికి మరింత లాభం సమకూర్చేలా చర్యలు తీసుకుంటూ ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు వ్యక్తిగత రుణాలు మంజూరు చేస్తామన్నారు. వారు తయారు చేసిన వంటకాలు, రసాయనాలు, బట్టలు, తినుబండారాలు, ఆహార పదార్థాలను బజార్లలో విక్రయించుకునేందుకు స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆదోనిలో ప్రత్యేకంగా మెప్మా బజారు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓర్వలేని ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నాయని, వారి మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్, రాజేశ్వర్ రెడ్డి, మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ కామాక్షి తిమ్మప్ప, మెప్మా సిఒలు అరుణ, కృష్ణవేణి, ఇద్రూస్, నాయకులు దేవా, మహబూబ్ బాషా, నరసింహ మూర్తి ఉన్నారు.
అర్బన్ మెప్మా మార్కెట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే










