ప్రజాశక్తి - కలెక్టరేట్
ప్రభుత్వ, ప్రెవేట్ రంగాల్లో శ్రామిక మహిళలు అనేక రూపాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నారని, అయితే వీరికి హక్కులు, వేతనాలు కరువయ్యాయని శ్రామిక మహిళా రాష్ట్ర నాయకులు పి.మణి ఆందోళన వ్యక్తం చేశారు. నిరంతరం మహిళా సాధికారతే ధ్యేయమని ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్ప వారి సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఆదివారం స్థానిక గిరిజన సామాజిక భవనంలో శ్రామిక మహిళా జిల్లా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సు మణి మాట్లాడుతూ రాష్ట్రంలో, జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మెడికల్ అండ్ హెల్త్, నర్సులు, స్కీమ్ వర్కర్లు, భవన నిర్మాణం, ఇంటి పని వారు, ప్రైవేట్ స్కూల్లో, హాస్పిటల్స్, కాలేజీల్లో, చిన్న పరిశ్రమల వంటి పలు రంగాల్లో అత్యధిక సంఖ్యలో శ్రామిక మహిళలు పనిచేస్తున్నారన్నారు. పురుషులతో సమానంగా పనిచేస్తున్నా వీరికి సమాన వేతనం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాలు కరువయ్యాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, సరళీకరణ విధానాలకు తలుపులు బార్ల తెరుస్తూ కార్మిక వర్గంపై తీవ్ర దాడి చేస్తున్నాయని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా మనదేశంలోనూ, రాష్ట్రంలోనూ తీవ్ర ప్రతిఘటన జరుగుతుందన్నారు. ఈ పోరాటాల్లో శ్రామిక మహిళలు సమరశీలంగా పాల్గొంటున్నారని, ఐక్య ఉద్యమాలను సంఘటితం చేయడంతో పాటు మొత్తం కార్మిక ఉద్యమంలో శ్రామిక మహిళలందర్నీ సమీకరించే కృషి చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకులు ఎం.ఉమామహేశ్వరి మాట్లాడుతూ నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుదలకు దారితీసే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరమింప చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆహార సరుకులు చిల్లర ధరలను నియంత్రించేందుకు కేరళలోని వామపక్ష ప్రభుత్వం అక్కడి ప్రజలకు చౌక ధరల దుకాణాల ద్వారా 16 రకాల నిత్యవసర సరుకులను తగ్గింపు ధరలపై సరఫరా చేస్తుందన్నారు. దీనివల్ల అధిక ధరల ప్రభావం కేరళ ప్రజలపై అతి స్వల్పంగా ఉందని తెలిపారు. కావున అదే విధంగా మన రాష్ట్రంలోనూ నిత్యవసర సరుకులను చౌకధరల దుకాణాల ద్వారా ప్రజలకు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. శ్రామిక మహిళల సమస్యలు పరిష్కరించాలని, అధిక ధరలు తగ్గించాలని, నిత్యవసర సరుకులను చౌక ధరల దుకాణం ద్వారా సరఫరా చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రెగ్యులర్ చేయాలని, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం పటిష్టంగా అమలు చేయాలని, బాలికలు, మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు వి.రామలక్ష్మి పెట్టిన తీర్మానాలను సదస్సులో పాల్గొన్న మహిళంతా ఆమోదం తెలిపారు. హింస లేని సమాజం కోసం పోరాడుదామని నినధించారు. సదస్సులో అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు జి.జ్యోతి, జి.తులసి, ఆర్.లక్ష్మి అధ్యక్ష్యతన జరిగిన సదస్సులో భవన నిర్మాణ నాయకులు ఎం.గౌరమ్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు, కోశాధికారి గొర్లి వెంకటరమణ, ఉపాధ్యక్షులు వి.ఇందిర, నాయకులు బి.సూరిబాబు, ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి, పలువురు శ్రామిక మహిళలు, అసంఘటిత కార్మికులు పాల్గొన్నారు.










