Jul 28,2023 22:16

హిందూపురంలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి

ప్రజాశక్తి-హిందూపురం : మహిళల రక్షణే తమ లక్ష్యమంటూ గద్దెనెక్కిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ లక్ష్యాలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని చట్టాలను చేయడమే కాదు వాటిని కఠినంగా అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి విమర్శించారు. ఐద్వా ఆధ్వర్యంలో చేపట్టిన హింసపై మహిళల పోరు యాత్ర శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి శుక్రవారం ప్రారంభం అయింది. ఈ యాత్రను కార్మికురాలు అక్కమ్మ జెండా ఊపి ప్రారంభించారు. ఐద్వా జిల్లా గౌరవ అధ్యక్షురాలు దిల్షాద్‌ అధ్యక్షత ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అలివేలు, కోశాధికారి సావిత్రి, రాష్ట్ర నాయకురాలు గౌతమి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ దేశంలోనూ... రాష్ట్రంలోనూ చిన్నారులపై మహిళలపై హింస రోజు రోజుకి విపరీతంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి బంగారు పతకాలను సాధించి, ప్రపంచ పటంలో దేశ గౌరవాన్ని చాటి చెప్పిన మహిళా మల్లయోధులు తమకు జరిగిన అన్యాయంపై దేశ రాజధానిలో ఆందోళన చేయడమే అందుకు నిదర్శనమన్నారు. ప్రతినిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట మహిళలు హింసకు గురి అవుతున్నారన్నారు. మల్లయోధులపై లైంగిక దాడికి పాల్పడిన బిజెపి ఎంపిని అరెస్టు చేసినట్లు చేసి బెయిల్‌పై విడుదల చేశారు. మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరిగించి అత్యాచారం చేసి హత్యలు చేస్తున్నప్పటికి ప్రదాని మోదీకి చలనం లేదన్నారు. చివరకు సుప్రీం కోర్టు స్పందించే వరకు కేసులు నమోదు చేయలేదన్నారు. కేసులు అయితే నమోదు చేసి ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. హిందూపురం ఎంపీ అర్ధనగంగా మహిళతో సంభాషణ చేస్తున్న విడియోలు సామాజిక మాధ్యమాల్లో వచ్చినా అతనిపై చర్యలు చేపట్టలేదన్నారు. మహిళా రక్షణ కోసం తీసుకొచ్చిన ఫోక్స్‌ చట్టాన్ని ఎత్తి వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. గత కాలంలో మహిళలపై ఆంక్షలు విధించి అణచివేతకు గురి చేసిన మనువాద సిద్ధాంతాన్ని తిరిగి సమాజంపై, మహిళలపై బలవంతంగా రుద్దడానికి కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మత్తు, మద్యం వల్లే నిత్యం మహిళలు హింసకు, దాడులకు గురి అవుతున్నారని వీటిని సంపూర్ణంగా నిషేధించాలని డిమాండ్‌ చేశారు. పాదయాత్ర సమయంలో జగన్‌ మోహన్‌ రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పి నిషేధ చట్టాన్ని తీసుకురాక పోగా మత్తు పదార్థాలను విచ్చలవిడిగా దొరికే విధంగా చేశారని విమర్శించారు. ప్రభుత్వం తన చేతగానితనం వల్ల విశాఖ నుంచి హిందూపురానికి గంజాయి దిగుమతి చేసుకొని ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ పారిశ్రామిక కేంద్రంగా ఉన్న హిందూపురాన్ని.... గంజాయి ఎగుమతి కేంద్రంగా మార్చారన్నారు. ఇప్పటి వరకు 3200 మంది అమ్మాయిలు మాయం అయినారు. వీరి ఆచూకీని రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలన్నారు. 190 మంది అత్యాకారాలకు గురయ్యారన్నారు. వీరికి ఇంత వరకు న్యాయం జరగ లేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మతతత్వ బిజెపి ప్రభుత్వం దేశాన్ని, దేశ సంపదను, ఖనిజాలను ఆదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. అందుకోసమే ఆర్టికల్‌ 370 రద్దుచేసి కాశ్మీర్‌ భూములపై ఆదానీ, అంబానీల పెత్తనం చలాయించే విధంగా చేశారన్నారు. మణిపూర్‌ లో ఆదివాసులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో విలువైన ఖనిజ సంపద ఉందని తెలుసుకొని ఆ సంపదను ఆదానికి దోచిపెట్టడానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ రిజర్వేషన్‌ పేరుతో కులాల మధ్య చిచ్చు రేపి హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారన్నారు. మహిళలు వివస్త్రలను చేసి అత్యాచారం చేసి హత్యలు చేస్తున్న వారికీ మతతత్వ ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని చూస్తూ ఉంటే నాటి రావణాసురులను మించిన రావణాసురులు నేడు ఉన్నారనిపిస్తోందన్నారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే మహిళలపై జరుగుతున్న నేరాలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నారు. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మీడియా మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసి హింస, అశ్లీలత, అసమానతలు ప్రేరేపించే చలనచిత్రాలు, టీవీ సీరియల్స్‌, ఇంటర్నెట్‌ కార్యక్రమాలను నిషేధించాలన్నారు. కళాశాలలో, పని ప్రదేశాల్లో వేధింపులను నిరోధించేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. మద్యం, మత్తు పదార్థాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుని, ప్రతి మండలానికి ఒక మద్యం షాపును మాత్రమే అనుమతించాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలో రెండు ప్రాంతాల నుంచి పోరు యాత్రను చేపట్టామన్నారు. ఆగస్టు 9న విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మహిళల పోరు ఏమి అన్నది ప్రభుత్వాలకు చూపిస్తామన్నారు. ఇప్పటికే దేశంలో అన్ని ప్రాంతాల్లోనే ఎన్నికల వేడి మొదలైందని ఇంటి ఇద్దకు వస్తున్న నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. మహిళల రక్షణ కోసం, ఆడ పిల్లల రక్షణ కల్పించడానికి కఠిన చట్టాలను తీసుకోచ్చి, వాటిని అమలు చేయాలని నిలదీయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు లావణ్య, రామాంజనమ్మ, జ్యోతి, అక్కమ్మ, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంతియాజ్‌, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జెడ్పీ శ్రీనివాసులు, ఇఎస్‌ వెంకటేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బాబావలి, నాయకులు నరసింహప్ప, జగదీష్‌, సిపిఎం అనుబంధ సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
పెనుకొండ : మహిళలపై జరుగుతున్న హింసను నివారించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి డిమాండ్‌ చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో చేపట్టిన హింసపై మహిళల పోరుయాత్ర శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా మహిళా రక్షణ నాటక ప్రదర్శనను నిర్వహించారు. అనంతరం ఐద్వా జిల్లా కార్యదర్శి గౌతమి అధ్యక్షతన జరిగిన సభలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అలివేలమ్మ, రాష్ట్ర కోశాధికారి సావిత్రమ్మ ,జిల్లా గౌరవాధ్యక్షులు దిల్షాద్‌ తదితరులు మాట్లాడారు. మహిళలపై హింసను నివారించడానికి తీసుకునే చర్యలపై న్యాయ నిపుణులతో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రోత్సహించాలన్నారు. జస్టిస్‌ వర్మ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్‌ హరి, సిఐటియు జిల్లా కార్యదర్శి రమేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న ,జిల్లా సహాయ కార్యదర్శి గంగాధర్‌ ,వెంకటరాముడు, నారాయణ,తిప్పన్న, నరసింహ, కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు హనుమయ్య, వెంకటేష్‌, రంగప్ప, తిప్పన్న, కొండ వెంకటేష్‌, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కదిరి అర్బన్‌ : హిందూపురంలో ప్రారంభమైన హింసపై మహిళల పోరుయాత్ర శుక్రవారం రాత్రి కదిరి పట్టణానికి చేరుకుంది. ఈ సందర్బంగా పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు గౌతమీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాదేవి, రాష్ట్ర కోశాధికారి వి. సావిత్రి, శ్రామిక మహిళ సంఘం కన్వీనర్‌ దిల్షాద్‌, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జిఎల్‌ నరసింహులు, జగన్మోహన్‌, ముస్తాక్‌వలి, రామ్మోహన్‌, ఆంజనేయులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బాబ్జాన్‌ తదితరులు పాల్గొన్నారు.