ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
సెప్టెంబరు 25, 26, 27వ తేదీలలో బాపట్ల జిల్లాలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం(బికెఎంయు) రాష్ట్ర 22వ మహాసభలను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనంలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల వాల్‌పోస్టర్‌ను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు సందర్భంగా బాపట్లలో సెప్టెంబర్ 25న గ్రామీణ పేదలతో కూలిదండు మహా ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. 300 మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బోడ వజ్రం, గోలిమే బాల యేసు, కూరాకుల బాబురావు, ముళ్లగిరి లాజరు, పొట్టేలు పెంటయ్య పాల్గొన్నారు.










