మహాపాదయాత్రకు విస్తృత ప్రచారం
ప్రజాశక్తి-కర్నూలు ప్రత్యేక ప్రతినిధి
జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈనెల 26నుంచి 31 వరకు కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే మహాపాదయాత్ర కోసం సిపిఎం ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా కర్నూలు పట్టణంలో ఇంటింటికి తిరిగి సిపిఎం బృందాలు సమస్యలను సేకరిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండలకేంద్రాల్లో సమావేశాలు, సభలు నిర్వహించి మహాపాదయాత్ర ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికోసం రూ.10వేల కోట్లు కేటాయించాలని సిపిఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరింది. జిల్లా కేంద్రం నుండి రాజధాని అమరావతికి రోడ్డు, రైలు మార్గాలు వేసి, కర్నూలు నుండి అమరావతికి రెగ్యులర్ రైలు నడపాలన్నారు. రైల్వే వ్యాగన్ వర్క్ షాప్‌ను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆదోని, ఎమ్మిగనూరులలో టెక్స్‌టైల్ పార్కులను నిర్మించాలన్నారు. సమస్యల పరిష్కారానికి సిపిఎం దశలవారి ఆందోళనలలో భాగంగా ఈనెల 10 వరకు గ్రామాల్లో, వార్డులలో పర్యటించి స్థానిక సమస్యలను గుర్తించి సచివాలయాల్లో వినతి పత్రాలు ఇస్తామన్నారు. రెండో దశలో 11,12,13 తేదీల్లో కరపత్రాలు వేసి అన్ని నియోజకవర్గాలలో ఆరుజీపు జాతాల ద్వారా ప్రచారం చేయనున్నారు. విద్యుత్ భారాలను తగ్గించాలని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో విద్యుత్ ప్రధాన కార్యాలయాల ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించి ఎస్‌ఇలకు వినతిపత్రాలు ఇచ్చారు. ఈనెల 10, 11 తేదీల్లో కర్నూలు ధర్నా చౌక్‌లో నిరసన తెలపడానికి అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో వాల్‌పోస్టర్లు విడుదల చేసి ధర్నాకు భారీగా తరలిరావాలని ప్రచారం చేశారు. ఈనెల ఒకటి నుంచి జగనన్న సురక్ష పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సమస్యలను గుర్తించడంతోపాటు కుల, ఆదాయ, ఇతర సర్టిఫికెట్లను అందజేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొంటున్నారు. ఆల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి కోరుతూ నంద్యాల జిల్లా గోరుమానుపల్లె గ్రామంలో అధికారులు ప్రజలనుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుమతి ఇవ్వాలని వాదించగా, మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్‌రెడ్డి అనుమతి ఇవ్వవద్దని వాదించారు. కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. సామాన్యుడు కొని తినలేని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా టమోట ధర కిలో రూ.160కి పెరిగింది. సబ్సిడీ టమోటా కర్నూలు మార్కెట్‌లో గంట, రెండు గంటలు అమ్మి స్టాక్ అయిపోయిందని బోర్డు పెడుతున్నారు. వర్షం దోబూచులాడుతోంది. సీజన్ అయిపోతున్నా పూర్తిస్థాయిలో వర్షం కురువక పోవడంతో రైతులు ఆందోళన చెంతుతున్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు నిబంధనల ప్రకారం నిర్వహించలేదని డిఇఒ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. సిపిఎస్ రద్దు చేసి పాతపద్దతిని అమలు చేయాలని ఉపాధ్యాయ, ఉద్యోగులు మరోసారి నిరసన తెలిపారు. కర్నూలు 165 అవతరణ దినోత్సవాన్ని తెలుగు సూరన్న తోటలో ప్రముఖ పరిశోధకులు ఆచార్యు మన్సూర్ రహ్మాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 165 అంశాలను ఎంపిక చేసిన కవులు, రచయితలతో 165 పుస్తకాలను ముద్రించాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆదీనంలో నిర్వహించేందుకు మేధావులను, ప్రజాప్రతినిధులను , విద్యాసంస్థలను భాగస్వాములను చేయాలని అనుకున్నారు.
eevaram nandayala










