Jun 04,2023 22:11

నటుడు ప్రసాద్‌ను ఆశీర్వదిస్తున్న వేద పండితులు

మహానందిలో 'బలగం' నటుడు ప్రసాద్‌
ప్రజాశక్తి - మహానంది

     మహానంది పుణ్యక్షేత్రాన్ని బలగం చిత్రం నటుడు ఎస్‌ఆర్‌ఎస్‌ ప్రసాద్‌ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా వారు స్వామి అమ్మవార్లను దర్శించుకని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అనంతరం వారిని ఆలయ అర్చకులు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. కళలు సమాజ చైతన్యానికి ప్రతీకలని అన్నారు. తాను నంద్యాల వాసినేనని అన్నారు. 40 ఏళ్లుగా సాంఘిక నాటకాల ప్రదర్శనలను చేస్తుండడం వల్ల సినిమాల్లో, ధారావాహికల్లో అవకాశాలు లభించాయని తెలిపారు. మన దేశంతో పాటు కువైట్‌లోనూ ప్రదర్శనలను చేసినట్లు చెప్పారు. ఇటీవల ఎంతగానో ప్రేక్షకుల ఆదరణ పొందిన బలగం సినిమాలో మంచి అవకాశం రావడంతో తనను బలగం ప్రసాద్‌ అని పిలుస్తున్నారని సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రముఖ హీరో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో పూజారిగా చక్కటి వేషం దొరికిందని పేర్కొన్నారు. నందమూరి జయకష్ణ కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా చేస్తున్న బ్రీత్‌ సినిమాలో హీరోకు మేనమామగా నటిస్తున్నట్లు తెలిపారు. ఇది త్వరలో రిలీజ్‌ అవుతుందని చెప్పారు. ఇప్పటి వరకు 43 సినిమాల్లో, 10 ధారావాహికల్లో, రెండు వెబ్‌ సిరీస్‌లలో నటించినట్లు తెలిపారు. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల్లో భరతనాట్యం, ఖుషి, బైరాన్‌ పల్లి, జై అమరావతి ఇంకా పేర్లు ఖరారు కానీ ఆరు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. అలాగే రంగులరాట్నం, దేవతలారా దీవించండి, సూర్యకాంతం, రాధమ్మ కూతురు వంటి ధారావాహికల్లో నటిస్తున్నట్లు వివరించారు. నాటక రంగంలో ఇప్పటికే 250 పైగా ఉత్తమ నటుడు బహుమతులను అందుకున్నట్లు తెలిపారు. తాను ఆర్టీసీ కండక్టర్‌గా పని చేస్తూనే నాటకాల పట్ల మక్కువతో నటిస్తున్నట్లు చెప్పారు. నంద్యాలలో ప్రముఖ వైద్యులు డాక్టర్‌ మధుసూదన్‌ రావు, డాక్టర్‌ గుర్రాల రవికృష్ణల సారధ్యంలో కళారాధ సంస్థను నెలకొల్పి ఎన్నో చైతన్య కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు చేసి ప్రజల చేత ప్రశంసలు పొందినట్లు పేర్కొన్నారు. సాంఘిక నాటక రంగంలో బళ్లారి రాఘవకు నంది అవార్డులను అందుకున్నట్లు వివరించారు.