Apr 05,2023 22:48

nivali arpistunna collector p.ranjitbasha

మహానీయుల జీవితాలు ఆదర్శం కావాలి : కలెక్టర్‌
ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)
దేశానికి, సమాజానికి బాబు జగ్జీవన్‌ రామ్‌ చేసిన సేవలు మరువలేనివని జిల్లాకలెక్టర్‌ పి.రంజిత్‌భాష అన్నారు. భారత మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబూ జగ్జీవన్‌ రామ్‌ 115వ జయంతి మహోత్సవం జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా, జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజిత సింగ్‌, డిఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, వైసిపి యువనాయకుడు పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తదితర అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులతో కలసి బుధవారం స్థానిక మలకపట్నంలో బాబూ జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా పరిషత్‌ సమావేశపు హాలులో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, డిఆర్వో వివిధశాఖల అధికారులు సంక్షేమ హాస్టళ్ల విద్యార్ధులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో గాంధీజీతో కలిసి జగ్జీవన్‌ రామ్‌ పాల్గొని జైలుశిక్ష అనుభవించారని గుర్తుచేశారు. తొలుత సాంఘిక సంక్షేమశాఖ డిడి సరస్వతి సభకు స్వాగతం పలికి జగ్జీవన్‌ రామ్‌ జీవిత విశేషాలు వివరించారు. ఈ సమావేశంలో ఎస్‌.సి కార్పొరేషన్‌ ఈడీ చంద్రలీలా, బిసి కార్పొరేషన్‌ ఈడీ ఎ. శ్రీనివాసరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.