ప్రజాశక్తి - ఆదోని
జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈనెల 26 నుంచి 31 వరకు చేపట్టే మహా పాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పిఎస్.రాధాకృష్ణ, కె.వెంకటేశులు కోరారు. సోమవారం పట్టణంలోని రెవెన్యూ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని, కరువు నివారణ జరగాలంటే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని కోరారు. హంద్రీనీవా ద్వారా 106 చెరువులకు నీళ్లు నింపాలని, జిల్లా యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలు స్థాపించాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర ప్రారంభోత్సవానికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కె.ప్రభాకర్ రెడ్డి, వి.వెంకటేశ్వర్లు హాజరవుతారని తెలిపారు. ఆదోని ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు వాతావరణం అనుకూలంగా ఉందన్నారు. గతంలో పరిశ్రమలు ఉండడం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి పొందేవారని తెలిపారు. వేదవతి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులను రాబట్టడంలో స్థానిక పాలకులు విఫలం చెందారని విమర్శించారు. సమస్యలు పరిష్కారం కావాలంటే సమైక్య పోరాటాలు అవసరమన్నారు. పాదయాత్రలో ప్రజల అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సిపిఎం పట్టణ, మండల కార్యదర్శులు లక్ష్మన్న, లింగన్న, నాయకులు రామాంజనేయులు, వీరేష్, శ్రీనివాసులు, మునిస్వామి, తిక్కప్ప ఉన్నారు. ఆస్పరిలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి హనుమంతు మాట్లాడారు. వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిందని, పరిశ్రమలు, ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించ లేదని మండిపడ్డారు. జిల్లాలోని తుంగభద్ర నది నుంచి దిగువకు వందలాది టిఎంసిల నీరు వృథాగా పోతున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. సిపిఎం నాయకులు బాలకృష్ణ, రామాంజనేయులు, రంగస్వామి, మధు రెడ్డి పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న రాధాకృష్ణ










