Jul 21,2023 18:52

ఆటో జాతానుద్దేశించి మాట్లాడుతున్న వెంకటేశులు

ప్రజాశక్తి - కోసిగి
జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి 31 వరకు చేపట్టే మహా పాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కె.వెంకటేశులు, మండల కన్వీనర్‌ రాముడు కోరారు. శుక్రవారం కోసిగిలో ఆటో జాతాను ప్రారంభించి మాట్లాడారు. కోసిగి మండలం అత్యంత వెనుకబడిందని, ఈ మండలం ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉందని తెలిపారు. సాగునీటి వనరులు పరిమితంగా ఉన్నాయని, నిత్యం కరువు కాటకాలకు గురవుతుందని చెప్పారు. ఖరీఫ్‌ సీజన్‌ తర్వాత గ్రామాలకు గ్రామాలే వలసలు వెళ్తాయని తెలిపారు. మండలం సమగ్రాభివృద్ధి జరగాలంటే ఆర్‌డిఎస్‌ కుడి కాలువ నిర్మాణం పూర్తి చేయాలని, మండలంలోని అన్ని గ్రామాలకూ సాగునీరందించాలని కోరారు. పులికనుమ నుంచి కోసిగి చుట్టుపక్కల గ్రామాల రైతులకు సాగునీరందించాలని, వలసల నివారణకు ఉపాధి హామీ చట్టం కింద ప్రతి కూలీకీ 200 రోజులు పని దినాలను కల్పించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ నెలకొల్పి ఉపాధి కల్పించాలన్నారు. అన్ని గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఎస్‌ఎస్‌ ట్యాంకు నిర్మాణం పూర్తి చేసి రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఐటిఐ కళాశాల ఏర్పాటు చేయాలని, క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం మండల నాయకులు వీరేష్‌, రామకోటి హనుమంతు, నాగేంద్ర, ముక్కరన్న, ప్రకాష్‌, నీలకంఠప్ప, గోపాల్‌, రంగ, హనుమంతు, వెంకటేష్‌ పాల్గొన్నారు.